Begin typing your search above and press return to search.

అమెరికాలో హిట్ & రన్ కేసు... దీప్తి గురించి చేదు వార్త!

అమెరికాలోని టెక్సాస్ లోని డెంటన్ లో దీప్తి వంగవోలు అనే తెలుగు విద్యార్థిని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 April 2025 10:35 AM IST
Hit And Run Tragedy In Texas
X

అమెరికాలోని నార్త్ టెక్సాస్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్న తెలుగు విద్యార్థిని దీప్తి వంగవోలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఏప్రిల్ 12 తెల్లవారుజామున డెంటన్ లో ఆమెను ఢీకొట్టిన అనంతరం డ్రైవర్ ఆపకుండా వాహనంలో వేగంగా వెళ్లిపోయాడు. ఈ సమయంలో.. చికిత్స పొందుతున్న ఆమె తుది శ్వాస విడిచారు!

అవును... అమెరికాలోని టెక్సాస్ లోని డెంటన్ లో దీప్తి వంగవోలు అనే తెలుగు విద్యార్థిని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. ప్రాణాలతో బయటపడలేకపోయిందని తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. ఆమె తుది శ్వాస విడిచారు. దీంతో... ఆ కుటుంబంలోనూ, స్నేహితుల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది!

కాగా... ఏపీలోని గుంటూరుకు చెందిన దీప్తి వంగవోలు.. నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో 2023లో బీటెక్ పూర్తి చేసి.. ఉన్నత చదువు, ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికా వచ్చారు. ఈ క్రమంలో.. ఆమె నార్త్ టెక్సాస్ యూనివర్సిటీలో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో మాస్టర్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలో శనివారం ఉదయం 2:12 గంటల ప్రాంతంలో దీప్తి వంగవోలు, ఆమె స్నేహితురాలు కాలినడకన ఇంటికి చేరుకోబోతుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. అనంతరం ఆ వాహనం డ్రైవర్ పారిపోయాడు. ఈ సమయంలో దీప్తి తలకు లోతైన గాయం అవ్వగా.. ఆమెకు ఆపరేషన్ జరుగుతోందని స్థానిక మీడియా వెల్లడించింది.

అయితే ఈ సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడిన దీప్తి.. తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది! మరోపక్క.. దీప్తితో పాటు ప్రమాదానికి గురైన మరో విద్యార్థిని కూడా తీవ్రంగా గాయపడినా.. ఆమెకు ప్రాణాపాయం లేదని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి!