అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై దారుణం.. హేట్ క్రైమ్ గా అనుమానాలు?
తెలంగాణకు చెందిన యువకుడు దీక్షిత్ రెడ్డి టెక్సాస్‌లోని ఐర్వింగ్ నగరంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు.
By: Tupaki Desk | 29 Aug 2025 11:13 AM ISTఅమెరికాలో మరోసారి గన్ హింస తెలుగు కుటుంబాలను కలిచివేసింది. తెలంగాణ విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ దాడి హేట్ క్రైమ్ అని భావిస్తున్నారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో తెలుగు విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ తెలుగు వాళ్లపై హేట్ క్రైమ్ దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ ఆంక్షల కారణంగా ఇబ్బందులు పడుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, విద్యార్థులు.. ఈ హేట్ క్రైమ్ తో భయాందోళనకు గురవుతున్నారు.
తెలంగాణ విద్యార్థిపై కాల్పలు..
తెలంగాణకు చెందిన యువకుడు దీక్షిత్ రెడ్డి టెక్సాస్‌లోని ఐర్వింగ్ నగరంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆగస్టు 26న ఒక 7-ఎలెవన్ స్టోర్ వద్ద జరిగిన ఈ ఘటనలో దీక్షిత్ రెడ్డిపై కాల్పులు జరుగగా, తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
వైద్యుల సమాచారం ప్రకారం దీక్షిత్‌కు బుల్లెట్లు తగలడంతో కాలర్ బోన్, పలు ఎముకలు విరిగాయి. అంతేకాదు ఊపిరితిత్తుల్లో ఒకటి దెబ్బతిని పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. అత్యవసర శస్త్రచికిత్స జరిపిన వైద్యులు ఇంకా పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడి వెనుక కారణం ఏమిటనే విషయంలో స్పష్టత రాలేదు. అయితే కొందరు ఇది హేట్ క్రైమ్ కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దీక్షిత్ రెడ్డి ఇటీవలే చదువు పూర్తిచేసుకుని అమెరికాలో ఐటీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉద్యోగం ఇంకా రాకపోవడంతో అతనికి ఆరోగ్య బీమా సౌలభ్యం లేకుండా పోయింది దీంతో ఆసుపత్రి ఖర్చులు భరించడం ఆ కుటుంబానికి చాలా భారంగా మారింది. పెద్ద ఎత్తున శస్త్రచికిత్స వ్యయం, ఆసుపత్రి బిల్లులు, పునరావాస ఖర్చులు ఆ కుటుంబానికి భారంగా మారాయి.
స్నేహితుడి కోసం గో ఫండ్ మీ..
ఈ పరిస్థితుల్లో దీక్షిత్ మిత్రులు గోఫండ్‌మీ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇప్పటికే దాదాపు 450 మంది తమ వంతు సాయం అందించి 14 వేల డాలర్లకు పైగా విరాళాలు అందించారు. లక్ష్యంగా పెట్టుకున్న 45 వేల డాలర్లను చేరుకోవడానికి ఇంకా సహకారం అవసరమని దీక్షిత్ స్నేహితులు చెబుతున్నారు.
దీక్షిత్ రెడ్డి గురించి ఆయన మిత్రులు చెబుతూ – “ఆయన ఎంతో కష్టపడి చదువుకున్న, సహృదయంతో ఉండే వ్యక్తి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించని మంచి మనిషి” అని పేర్కొన్నారు. అమెరికాలో కొనసాగుతున్న గన్ హింస మరోసారి తెలుగు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
