డల్లాస్ లో ఇల్లు కొన్న ఇండియన్స్ అంతా ఢమాల్..
అసలు ధర కంటే ఏకంగా లక్ష డాలర్లు తగ్గించి ఇస్తామన్నా కూడా మార్కెట్‌లో ఇళ్లు అమ్ముడుపోని పరిస్థితి నెలకొంది. డల్లాస్‌లో ఒకప్పుడు వెలిగిపోయిన ఇండియన్ కమ్యూనిటీ.. ఇప్పుడు ఉద్యోగ భద్రత లేక, ఉన్న ఆస్తులను వదులుకోలేక ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది.
By: A.N.Kumar | 16 Jun 2026 11:00 AM ISTఅమెరికాలోని డల్లాస్ నగరం అంటే ఐటీ ఉద్యోగాలకు.. స్థిరపడిన భారతీయులకు ఒక సురక్షితమైన స్వర్గధామం. కానీ ఇటీవల కొందరు భారతీయులు చేసిన అతి ప్రవర్తనలు, మితిమీరిన హంగామా అక్కడ స్థానిక అమెరికన్లలో తీవ్ర అసహనాన్ని పెంచేసి, చివరకు అది జాత్యహంకార ధోరణులకు దారితీస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే.. అక్కడ స్థానికులు భారతీయులను చూసే కోణమే మారిపోవడంతో పాటు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కూడా మొదలయ్యాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు తిరిగి కొలువులు సాధించడానికి సరైన అవకాశాలు లేకపోవడం ఒకవైపు వేధిస్తుంటే.. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలుతోంది. ఇటీవలే అక్కడ ఇళ్లు కొనుగోలు చేసిన భారతీయులు.. మారిన పరిస్థితుల వల్ల వాటిని అమ్ముకుందామని చూసినా కొనే నాథుడు లేడు. అసలు ధర కంటే ఏకంగా లక్ష డాలర్లు తగ్గించి ఇస్తామన్నా కూడా మార్కెట్‌లో ఇళ్లు అమ్ముడుపోని పరిస్థితి నెలకొంది. డల్లాస్‌లో ఒకప్పుడు వెలిగిపోయిన ఇండియన్ కమ్యూనిటీ.. ఇప్పుడు ఉద్యోగ భద్రత లేక, ఉన్న ఆస్తులను వదులుకోలేక ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం.. ముఖ్యంగా డల్లాస్ నగరం గత రెండు దశాబ్దాలుగా ప్రవాస భారతీయులకు.. మరీ ముఖ్యంగా తెలుగు వారికి ఒక మినీ ఇండియా లాగా మారిపోయింది. ఐటీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్ రంగాల్లో ఉద్యోగాల కోసం వచ్చి ఇక్కడే స్థిరపడిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో డల్లాస్ ఎన్నారైల పరిస్థితిపై ఒక ఆందోళనకరమైన చర్చ నడుస్తోంది. డల్లాస్‌లో భారతీయుల 'అతి' ప్రవర్తన వల్లే అక్కడ వివక్ష మొదలైందని.. ఉద్యోగాలు కోల్పోయి.. భయంతో కొందరు ఇళ్లను తక్కువ ధరకు అమ్ముకుని ఇండియాకు తిరుగుపయనమవుతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముంది? అసలు డల్లాస్ రియల్ ఎస్టేట్, ఐటీ మార్కెట్లలో ఏం జరుగుతోంది? అన్న దానిపై స్పెషల్ ఫోకస్..
సోషల్ మీడియా ప్రచారం.. ఆ 'అతి' ఏంటి?
నెటిజన్ల వాదనల ప్రకారం.. డల్లాస్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారతీయుల జనాభా.. ముఖ్యంగా ఒకే వర్గానికి చెందిన వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అక్కడ స్థానిక సంస్కృతిని గౌరవించకుండా భారతీయ ప్రాంతీయ రాజకీయాలను ప్రదర్శించడం.. వీధుల్లో గుంపులుగా చేరి స్థానికులకు ఇబ్బంది కలిగించడం వంటి కొన్ని సంఘటనలు జరిగాయని.. దీనివల్ల అమెరికన్లలో అసంతృప్తి పెరిగి వివక్షకు దారితీస్తోందని కొందరు వాదిస్తున్నారు. ఈ సామాజిక సమన్వయ లోపం వల్లే భారతీయులను స్థానికులు చూసే కోణం మారుతోందనే విమర్శలు వస్తున్నాయి.
ఇళ్లు అమ్ముడుపోవడం లేదా? వేల డాలర్ల నష్టమా?
డల్లాస్‌లో ఇటీవల ఇల్లు కొన్నవారు లక్ష డాలర్లు తగ్గించి పెట్టినా కొనేనాథుడు కరువయ్యాడనే వార్త రియల్ ఎస్టేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీని వెనుక కేవలం వివక్షో లేదా భయమో మాత్రమే కారణం కాదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో అధిక వడ్డీ రేట్లు కొనసాగుతున్నాయి. దీనివల్ల సాధారణంగానే ఇళ్ల కొనుగోళ్లు దేశవ్యాప్తంగా మందగించాయి. కేవలం భారతీయుల ఇళ్లే కాదు.. మార్కెట్ పరిస్థితుల వల్ల అందరి ఇళ్ల అమ్మకాలపై ఈ ప్రభావం ఉంది.
ఐటీ అనిశ్చితి.. తిరుగుపయనం
మరో ప్రధాన కారణం.. అమెరికా టెక్నాలజీ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్స్ , వీసా ఇబ్బందులు. ఉద్యోగాలు కోల్పోవడం, హెచ్-1బి వీసా గడువు ముగియడం, కొత్త ఉద్యోగాలు త్వరగా దొరకకపోవడం వంటి ఆర్థిక సవాళ్ల వల్ల కొందరు ఎన్నారైలు స్వచ్ఛందంగానో.. తప్పనిసరో ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నారు. ఇలాంటి వారు తమ ఇళ్లను అత్యవసరంగా విక్రయించాల్సి రావడం వల్ల మార్కెట్ ధర కంటే తగ్గించి అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
గ్లోబల్ సిటిజన్స్‌కు ఇదొక హెచ్చరిక
ప్రస్తుతం డల్లాస్‌లో జరుగుతున్న ఈ చర్చ అధికారిక గణాంకాల కంటే సామాజిక మాధ్యమాల వేదికగానే ఎక్కువగా సాగుతోంది. అయినప్పటికీ విదేశాల్లో స్థిరపడే భారతీయులకు ఇదొక ముఖ్యమైన సూచనగా నిపుణులు భావిస్తున్నారు. ఏ దేశంలోనైనా వలసదారులుగా వెళ్లినప్పుడు ఆర్థిక స్థిరత్వంతో పాటు స్థానిక సమాజంతో సత్సంబంధాలు, పరస్పర గౌరవం, సామాజిక బాధ్యత చాలా ముఖ్యం. మన ప్రవర్తన స్థానిక సంస్కృతికి ఇబ్బంది కలిగించనంత కాలం ఏ దేశంలోనైనా భారతీయుల విజయకేతనం నిరంతరాయంగా సాగుతుంది. డల్లాస్ వివాదం కేవలం ఒక తాత్కాలిక మార్కెట్ ఒడిదొడుకు మాత్రమేనా లేక సామాజిక మార్పుకు సంకేతమా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.
