అమెరికాలో దారుణం.. విడిపోయిన భార్యను హత్య చేసిన భర్త!
అమెరికాలోని చికాగోలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనతో విడిపోయిన భార్య మరో వ్యక్తితో సంబంధం కొనసాగిస్తోందనే కోపంతో ఓ భారత సంతతి వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
By: Tupaki Desk | 16 Oct 2026 8:00 PM ISTఅమెరికాలోని చికాగోలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనతో విడిపోయిన భార్య మరో వ్యక్తితో సంబంధం కొనసాగిస్తోందనే కోపంతో ఓ భారత సంతతి వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఆగస్టులో జరగగా, నిందితుడు భారత్కు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
పోలీసుల కథనం ప్రకారం.. దంపతులు విడిపోయిన తర్వాత వారి చిన్న కుమార్తెను నిందితుడు తన తల్లిదండ్రుల వద్ద ఉండేందుకు భారత్కు పంపించాడు. అనంతరం కుమార్తెను కలవవచ్చంటూ భార్యను చికాగోకు పిలిచినట్లు తెలుస్తోంది.
భర్త పిలుపుతో అక్కడికి వెళ్లిన ఆమె, తన కొత్త భాగస్వామిని కారులోనే ఉంచి ఒంటరిగా అతడి అపార్ట్మెంట్లోకి వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరూ మళ్లీ కలిసి జీవించాలని నిందితుడు కోరినట్లు సమాచారం. ఆమె అందుకు నిరాకరించడంతో కత్తితో పలుమార్లు దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు, నిందితుడు విమానంలో భారత్కు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ, టికెట్ కౌంటర్ మూసివేయడంతో హోటల్లో వేచి ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అనంతరం పోలీసులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అపార్ట్మెంట్కు వెళ్లిన అతడి స్నేహితులు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుడిపై అమెరికాలో ఫస్ట్ డిగ్రీ మర్డర్ అభియోగాలు నమోదైనట్లు సమాచారం.
