తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్న విదేశాల్లోని తెలుగోళ్లు
సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదురుకాని ఇబ్బందులు.. కష్టాలు.. సవాళ్లను వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొన్నారు చంద్రబాబు.
By: Tupaki Desk | 14 Jun 2025 10:05 AM ISTసుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదురుకాని ఇబ్బందులు.. కష్టాలు.. సవాళ్లను వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొన్నారు చంద్రబాబు. చివరకు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. నిజానికి జైలు జీవితంలో ఆయన రాజకీయ జీవితం ముగుస్తుందని ఆయన రాజకీయ ప్రత్యర్థులు అంచనా వేస్తే.. నిజానికి అదే ఆయన రాజకీయ జీవితంలో మర్చిపోలేని ఘన విజయాన్ని తర్వాతి రోజుల్లో అందేలా చేసిందని చెప్పాలి. అంతేకాదు.. చంద్రబాబు అరెస్టు వేళ.. ఆయన ఇమేజ్ సరికొత్తగా తెర మీదకు రావటమే కాదు.. ఆయన విడుదల కోసం ఏపీ బయట జరిగిన ఆందోళనలు ఆసక్తికర చర్చకు తెర తీశాయి.
చంద్రబాబు అరెస్టు వేళ.. విదేశాల్లో స్థిరపడిన తెలుగువారి మీద ఎంత ప్రభావాన్ని చూపిందన్న విషయాన్ని స్పష్టం చేసింది. అంతేకాదు.. తెలుగు రాజకీయాల్ని విదేశాల్లోని తెలుగువారు సైతం కీలకమన్న కొత్త విషయం రాజకీయ పార్టీలు గుర్తించేలా చేశాయి. రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగోళ్లు విదేశాల్లో లక్షలాదిగా ఉన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా అమెరికాలోని తెలుగు వారు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి నియోజకవర్గంలో ఉండటం.. వారి మాట చెల్లుబాటు అయ్యేలా సంబంధాలు ఉన్నాయి.
చంద్రబాబు అరెస్టు వేళ.. అప్పట్లో ఏపీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నిరసన చేసే ధైర్యం ఎవరికి లేకుండా పోయింది. సాధారణంగా ఒక పెద్ద రాజకీయ నాయకుడి అరెస్టు జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో నిరసనలు.. ఆందోళనలతో అట్టుడికిపోతుంది. అందుకు భిన్నంగా ఏపీ బయట పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకున్నాయి. ఇదే చంద్రబాబు ఇమేజ్ ను భారీగా పెంచటమే కాదు.. చంద్రబాబు అరెస్టుతో లేని తలనొప్పిని కొని తెచ్చుకున్నామా? అన్న చర్చ వైసీపీలో మొదలైంది.
నిజానికి చంద్రబాబు అరెస్టు జరిగి ఉండకపోతే.. పవన్ కల్యాణ్ తనకు తానుగా టీడీపీకి మద్దతు ప్రకటించి ఉండేవారు కాదని..అరెస్టు వ్యవహారం టీడీపీ - జనసేన మధ్య దూరాన్ని తగ్గించేసి సోదర భావాన్ని పెంచేలా చేసిందని.. ఈ రెండు పార్టీలు చేతులు కలపటం అప్పటి అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారింది. అంతేకాదు.. టీడీపీ - జనసేన కలయిక విషయంలో ఏపీలోని టీడీపీ క్యాడర్ కు.. జనసేన ఫాలోవర్లకు మధ్య భేదాభిప్రాయాలు చాలానే ఉన్నాయి. అయితే.. అలాంటి వాటిని పక్కన పెట్టి.. ముందు పవర్ లోకి వచ్చేందుకు ఫోకస్ చేయాలన్న వాదనను డెవలప్ చేయటంలో విదేశాల్లోని తెలుగు వారు కీలకంగా వ్యవహరించారని చెబుతున్నారు.
దేశం కాని దేశంలో ఉన్నా.. ఏపీ రాజకీయాల్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యే ఆంధ్రోళ్లు.. తమ రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. తాము బాగున్నా.. తమను ఈ స్థాయికి తీసుకొచ్చిన తమ రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయేవారు. అందుకే.. తమ వంతు సాయంగా ఏపీలోని మూడు పార్టీలు ఒక జట్టుగా మారి.. ఎన్నికల బరిలోకి దిగేందుకు అవసరమైన ప్లాట్ ఫాం అందించారని చెప్పాలి. మొత్తంగా చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్ విదేశాల్లోని తెలుగువారి సత్తాను చాటిందని చెప్పక తప్పదు. ఇప్పుడు విపక్షంలో ఉన్న వారు విదేశాలకు వెళుతున్న వైనాన్ని చూస్తే.. అక్కడి వారి మద్దతును కూడగట్టుకోవటానికి జరుగుతున్న ప్లానింగ్ చూస్తే.. విదేశాల్లోని తెలుగు వారు తెలుగు రాజకీయాల్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
