ప్రవాస వ్యాపారులే టార్గెట్.. కెనడాలో 'ఫోర్ బ్రదర్స్' గ్యాంగ్ ఆట కట్టించిన 'ఎక్స్‌టార్షన్ టాస్క్ ఫోర్స్'
కెనడాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులను.. ముఖ్యంగా వ్యాపార వర్గాలను గత కొంతకాలంగా వణికిస్తున్న భారీ అంతర్జాతీయ దోపిడీ ముఠా గుట్టును అక్కడి పోలీసులు రట్టు చేశారు.
By: A.N.Kumar | 28 May 2026 4:00 PM ISTకెనడాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులను.. ముఖ్యంగా వ్యాపార వర్గాలను గత కొంతకాలంగా వణికిస్తున్న భారీ అంతర్జాతీయ దోపిడీ ముఠా గుట్టును అక్కడి పోలీసులు రట్టు చేశారు. దక్షిణాసియా వ్యాపారస్తులే లక్ష్యంగా బెదిరింపులు, వసూళ్లు, హింసాత్మక దాడులకు పాల్పడుతున్న 17 మంది భారత సంతతి యువకులను కెనడా రక్షక దళాలు ఒకేసారి అరెస్ట్ చేశాయి. ఈ భారీ ఆపరేషన్ దేశవ్యాప్తంగా ముఖ్యంగా ప్రవాస భారతీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
కెనడాలోని పీల్ రీజియన్ పరిధిలో గత కొన్ని నెలలుగా స్థానిక వ్యాపార సంస్థలపై కాల్పులు, లూటీలు, ఫోన్లలో బెదిరింపులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన పీల్ రీజినల్ పోలీసులు, ఈ నేరాలను అరికట్టడానికి ‘ఎక్స్‌టార్షన్ టాస్క్ ఫోర్స్’ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ప్రత్యేక దళం పక్కా నిఘా, వ్యూహాత్మక దాడుల ద్వారా ఒక భారీ అంతర్జాతీయ క్రిమినల్ నెట్‌వర్క్‌ను విజయవంతంగా ఛేదించింది. ఈ మేరకు సోమవారం రాత్రి పోలీసులు తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఒక సమగ్ర ప్రకటనను విడుదల చేస్తూ మంగళవారం నాటికి 17 మంది నిందితులను కటకటాల్లోకి నెట్టినట్లు స్పష్టం చేశారు.
అంతర్జాతీయ ముఠా 'ఫోర్ బ్రదర్స్'తో లింకులు
పోలీసుల ప్రాథమిక విచారణలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ అయిన యువకుల్లో అత్యధికులకు 'ఫోర్ బ్రదర్స్' అనే ప్రమాదకరమైన అంతర్జాతీయ నేర ముఠాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది.
కెనడా, అమెరికా దేశాల్లో స్థిరపడిన దక్షిణాసియా, ముఖ్యంగా భారతీయ మూలాలున్న వ్యాపార యజమానులను టార్గెట్.. వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేసి లక్షలాది డాలర్లను డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అడిగినంత డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే వారి ఇళ్లు, వ్యాపార స్థలాలపై భౌతిక దాడులు చేయడం, కాల్పులు జరపడం ఆస్తులను ధ్వంసం చేయడం చేస్తున్నారు..
నిందితుల వివరాలు.. స్వాధీనం చేసుకున్న సొత్తు
అరెస్టయిన 17 మంది కూడా భారత సంతతికి చెందిన యువకులేనని వీరంతా కెనడాలోని వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఈ అక్రమ నెట్‌వర్క్‌ను నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. వీరి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, నగదు, మొబైల్ ఫోన్లు, దోపిడీకి ఉపయోగించిన ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ప్రవాస భారతీయుల్లో పెరుగుతున్న ఆందోళన
కెనడాలో ఇటీవలి కాలంలో భారత సంతతికి చెందిన గ్యాంగ్‌లు, గ్రూపుల మధ్య వార్స్ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ప్రశాంతతకు, ఉపాధికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న కెనడాలో.. ఇప్పుడు సొంత దేశానికి చెందిన యువకులే ఇలాంటి దారి దోపిడీలు, అంతర్జాతీయ ముఠాలతో చేతులు కలపడం స్థానిక ఎన్నారైలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ పరిణామాలు కెనడాలో భారతీయుల ప్రతిష్టను మసకబార్చేలా ఉన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దర్యాప్తు ముమ్మరం: పోలీసుల ప్రకటన
"ఈ అంతర్జాతీయ ముఠా అరెస్టుతో ఒక పెద్ద క్రిమినల్ నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. అరెస్టయిన నిందితులను ఇప్పటికే కోర్టులో ప్రవేశపెట్టాము. ఈ ముఠా వెనుక ఉన్న కీలక సూత్రధారులు, సూత్రధారుల వెనుక ఉన్న అంతర్జాతీయ శక్తులను గుర్తించేందుకు మా దర్యాప్తును మరింత వేగవంతం చేశాం." అని పీల్ రీజినల్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
ఈ భారీ ఆపరేషన్, అరెస్టుల పర్వం స్థానిక దక్షిణాసియా, భారతీయ వ్యాపార వర్గాలకు గొప్ప ఊరటనిచ్చింది. పోలీసులు తీసుకున్న ఈ కఠిన చర్యల వల్ల భవిష్యత్తులో ఇలాంటి బెదిరింపులు తగ్గుతాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భయపడకుండా ఎలాంటి బెదిరింపులు వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
