అమెరికాలో భారతీయుడి దారుణ హత్య: పొరపాటున కిడ్నాప్ చేసి చంపేశారు
స్థానిక సిక్కు సమాజంలో ఎంతో గౌరవనీయుడైన అవ్తార్ సింగ్ గత 20 ఏళ్లుగా ట్రేసీలోని గురుద్వారాలో ప్రధాన వంటకుడిగా సేవలందిస్తున్నారు.
By: A.N.Kumar | 25 Feb 2026 3:44 PM ISTఅమెరికాలో ప్రవాస భారతీయుల భద్రతపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. కాలిఫోర్నియాలోని ట్రేసీ నగరంలో నివసిస్తున్న భారతీయ మూలాలున్న అవ్తార్ సింగ్ (57) అనే వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. అయితే ఈ హత్యలో ఒక విస్తుపోయే నిజం వెలుగుచూసింది. దుండగుల అసలు లక్ష్యం అవ్తార్ సింగ్ కాదని 'పొరపాటున' ఆయనను ఎత్తుకెళ్లి ప్రాణాలు తీసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
గురుద్వారా బయటే అపహరణ
స్థానిక సిక్కు సమాజంలో ఎంతో గౌరవనీయుడైన అవ్తార్ సింగ్ గత 20 ఏళ్లుగా ట్రేసీలోని గురుద్వారాలో ప్రధాన వంటకుడిగా సేవలందిస్తున్నారు. ఫిబ్రవరి 17న మధ్యాహ్నం సమయంలో ఆయన గురుద్వారా వెలుపల ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని అపహరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మూడు రోజుల తర్వాత మృతదేహం లభ్యం
కిడ్నాప్ జరిగిన మూడు రోజుల తర్వాత ట్రేసీకి సుమారు రెండు గంటల దూరంలో ఉన్న లేక్ బెరియెస్సా సమీపంలో అవ్తార్ సింగ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది యాదృచ్ఛికంగా జరిగిన దాడి కాదని, ఒక పథకం ప్రకారం జరిగిన కిడ్నాప్ అని పోలీసులు నిర్ధారించారు. కానీ, దుండగులు వేరొకరి కోసం వచ్చి పొరపాటున అవ్తార్ సింగ్‌ను తీసుకెళ్లినట్లు సాన్ జోక్విన్ కౌంటీ షెరిఫ్ కార్యాలయం అనుమానిస్తోంది.
ఆరు నెలల ముగ్గురు పసికందులు..
అవ్తార్ సింగ్ మృతితో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయనకు భార్యతో పాటు ఆరు నెలల వయసున్న ముగ్గురు కవల పిల్లలు ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఆ పసికందులు ఇటీవలే ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. తండ్రి నీడలో పెరగాల్సిన ఆ చిన్నారి ప్రాణాలు దుండగుల చిన్న 'పొరపాటు' వల్ల అనాథలయ్యాయని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.
దర్యాప్తు ముమ్మరం
ఈ కేసును హత్యగా నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. పోస్ట్‌మార్టం నివేదిక రావాల్సి ఉందని మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని ఇంకా వెల్లడించలేమని అధికారులు తెలిపారు.
ఈ ఘటన కాలిఫోర్నియాలోని భారతీయ, సిక్కు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. నిందితులను తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రవాస భారతీయులు డిమాండ్ చేస్తున్నారు.
