Begin typing your search above and press return to search.

అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తెలుగు తేజం

అమెరికాలో భారత సంతతికి చెందిన నిపుణులు రాజకీయ, సాంకేతిక, వైద్య రంగాల్లో సరికొత్త శిఖరాలు అధిరోహిస్తూ తమ సత్తాను చాటుతున్నారు.

By:  Tupaki Desk   |   13 Jun 2025 10:53 AM IST
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తెలుగు తేజం
X

అమెరికాలో భారత సంతతికి చెందిన నిపుణులు రాజకీయ, సాంకేతిక, వైద్య రంగాల్లో సరికొత్త శిఖరాలు అధిరోహిస్తూ తమ సత్తాను చాటుతున్నారు. ఈ కోవలోనే, ఆంధ్రప్రదేశ్‌ కి చెందిన ప్రముఖ వైద్యులు డా. బాబీ ముక్కమాల అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (AMA) అధ్యక్ష పదవిని స్వీకరించి చరిత్ర సృష్టించారు. 178 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన AMA కు అధిపతిగా ఎన్నికైన తొలి భారతీయుడు ఆయనే కావడం విశేషం. అంతేకాదు, దక్షిణ ఆసియా నుండి ఈ అత్యున్నత పదవిని చేపట్టిన వ్యక్తి కూడా డా. ముక్కమాలే.

53 ఏళ్ల డా. బాబీ ముక్కమాల అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించే సందర్భంగా జరిగిన సభలో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. "ఒకానొక దశలో నేను మయో క్లినిక్ లో బ్రెయిన్ సర్జరీ తర్వాత నాళాలూ, వైర్లూ ముడిపడి అనారోగ్యంతో బాధపడ్డాను. నేను అమెరికాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరిచే అవకాశం నాకు లభిస్తుందని కలలో కూడా ఊహించలేదు" అని ఆయన భావోద్వేగంగా అన్నారు.

గత నవంబరులో డా. ముక్కమాల తల భాగంలో 8 సెం.మీ వ్యాసం గల టెంపోరల్ లోబ్ ట్యూమర్ తొలగింపు శస్త్రచికిత్స జరిగింది.. ఈ వ్యక్తిగత అనుభవం తనకు ఆరోగ్య రంగంలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని మరింత బలంగా తెలియజేసిందని ఆయన పేర్కొన్నారు. "నాకు అద్భుతమైన చికిత్స అందింది. కానీ దేశవ్యాప్తంగా అంత స్థాయిలో అందరికీ అదే స్థాయి సేవలు అందేలా చేయాలి" అని ఆయన తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

అధ్యక్షుడిగా AMA ని మరింత అభివృద్ధి పరచాలనే సంకల్పంతో ఉన్నానని డా. బాబీ తెలిపారు. అమెరికాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. సమానమైన, నాణ్యమైన వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

డా. బాబీ ముక్కమాల వైద్య కుటుంబం నుండి వచ్చారు. ఆయన తండ్రి రేడియాలజిస్టు కాగా, తల్లి పిల్లల డాక్టరు (పెడియాట్రిషన్). ఆయన మిచిగాన్ విశ్వవిద్యాలయం మెడికల్ స్కూల్ నుండి వైద్య పట్టభద్రుడయ్యారు. అనంతరం చికాగోలోని లోయోలా యూనివర్సిటీ మెడికల్ సెంటర్ లో రెసిడెన్సీ పూర్తి చేశారు.

డా. బాబీ సతీమణి నీతా కులకర్ణి ప్రసూతి , గైనకాలజీ నిపుణురాలు. 2012లో ఈ దంపతులు కలిసి మిచిగాన్-ఫ్లింట్ యూనివర్సిటీలో "ఎండౌడ్ హెల్త్ ప్రొఫెషన్స్ స్కాలర్షిప్స్" ని స్థాపించి, వైద్య విద్యార్థులకు సహాయం చేస్తున్నారు. AMAలో రెసిడెన్సీ కాలం నుండి ప్రాథమికంగా చురుకుగా పాల్గొంటున్న డా. బాబీ ప్రస్తుతం AMA సబ్‌స్టెన్స్ యూజ్ అండ్ పెయిన్ కేర్ టాస్క్‌ఫోర్స్‌కు చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో భారతీయుల ప్రతిష్టను మరింత పెంచిన డా. బాబీ ముక్కమాల విజయం పట్ల దేశ ప్రజలు, ముఖ్యంగా భారతీయ ప్రవాసులు, తెలుగువారు గర్వంగా ఫీలవుతున్నారు. ఆయన నాయకత్వంలో అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో సానుకూల మార్పులు వస్తాయని ఆశిస్తున్నారు.