Begin typing your search above and press return to search.

పిస్టల్ పట్టుకొని వీధుల్లో వార్నింగ్ ఇస్తూ హల్ చల్ చేసిన మహిళ

అగ్రరాజ్యంలో ఆయుధాల ఆగడం అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Aug 2023 4:54 AM GMT
పిస్టల్ పట్టుకొని వీధుల్లో వార్నింగ్ ఇస్తూ హల్ చల్ చేసిన మహిళ
X

అగ్రరాజ్యంలో ఆయుధాల ఆగడం అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. పకోడీల మాదిరి కొనేందుకు అవకాశం ఉండటంతో.. గన్ కల్చర్ పుణ్యమా దారుణాలు చోటు చేసుకుంటున్న సందర్భాలు.. అమాయకులు పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాల గురించి తెలిసిందే. తాజాగా అలాంటి ఉదంతం యూఎస్ లోని ప్రజలను బెంబేలెత్తేలా చేసింది.

న్యూయార్క్ సమీపంలోని నసౌ కౌంటీలో ఒక మహిళ నడిరోడ్డు మీద భయాందోళనలకు గురి చేసింది. పిస్టల్ పట్టుకున్న ఆమె.. వీధుల్లో నడుస్తూ.. గన్ గురి పెట్టి బెదిరింపులకు దిగింది. ఎవరైనా దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు.. తనకు తాను గురి పెట్టుకున్న ఈమె తీరుతో అక్కడి స్థానికులు వణికిపోయారు. అలా అని తాను చేసే బెదిరింపులు ఉత్తుత్తి కావన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. గాల్లో కాల్పులు జరిపిన వైనంతో ప్రజలు ఉలిక్కిపడిన పరిస్థితి.

నసౌ కౌంటీలోని నార్త్ బెల్మూరులో మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఒక మహిళ గన్ పట్టుకొని రోడ్ల మీద తిరగటం మొదలు పెట్టింది. రోడ్డు మీద వెళ్లే వారికి గురి పెట్టటం.. వారు భయాందోళనలో పరుగులు తీయటం చేశారు. నడిరోడ్డు మీద తిరుగుతూ తనకు ఎదురుగా వచ్చే వాహనాలకు గురి పెట్టి హడలెల్తించింది. మధ్య మధ్యలో గాల్లో కాల్పులు జరిపింది.

ఈ ఉన్మాదికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు.. ఆమె ఉన్న చోటుకు వెళ్లారు. అప్పటికే నడి రోడ్డు మీద ఉన్న వాహనాల మధ్య నుంచి గాల్లో కాల్పులు జరిపింది. ఎదురుగా వస్తున్న కార్లకు గురి పెడుతూ.. తన కణతకు గురి పెట్టుకున్న పరిస్థితుల్లో ఆమె తీరు భయాందోళనలకు గురి చేసింది. ఈ క్రమంలో పోలీసులు ఆమెను తమ వాహనంతో ఢీ కొట్టి కిందపడేలా చేశారు. కన్నుమూసి తెరిచే లోపు.. కార్లలో నుంచి ఆమె వద్దకు వచ్చి.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో సదరు మహిళకు స్పల్వ గాయం కాగా.. ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి.. ఆమె విచిత్ర ప్రవర్తనపై విచారణ జరుపుతున్నారు. ఈమె తీరుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.