జ్యోతిష్య మోసం : న్యాసావ్ కౌంటీలో వ్యక్తి అరెస్ట్
నకిలీ జ్యోతిష్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఒక వ్యక్తిని అమెరికాలోని న్యాసావ్ కౌంటీ పోలీసు శాఖ అధికారులు జూలై 17, 2025న అరెస్ట్ చేశారు
By: Tupaki Desk | 25 July 2025 10:51 AM ISTనకిలీ జ్యోతిష్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఒక వ్యక్తిని అమెరికాలోని న్యాసావ్ కౌంటీ పోలీసు శాఖ అధికారులు జూలై 17, 2025న అరెస్ట్ చేశారు. క్వీన్స్‌కు చెందిన 33 ఏళ్ల హేమంత్ కుమార్ మునెప్ప ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 3న ఒక 68 ఏళ్ల వృద్ధురాలు జ్యోతిష్య సేవలు పొందేందుకు హేమంత్‌కు $20,000 (సుమారు ₹16.7 లక్షలు) చెల్లించింది. అనంతరం, జూలై 17న హేమంత్ ఆమెను హిక్స్‌విల్లేలోని అంజనా జీ (414C సౌత్ బ్రాడ్‌వే) అనే ప్రదేశానికి రప్పించి, మరోసారి జ్యోతిష్య సేవలకు గాను $42,000 (సుమారు ₹35 లక్షలు) డిమాండ్ చేశాడు.
ఈ భారీ మొత్తాన్ని సేకరించేందుకు హేమంత్ బాధితురాలిని బ్రాడ్‌వేలోని ఒక బ్యాంకుకు తీసుకెళ్లి నగదు విత్‌డ్రా చేయించేందుకు ప్రయత్నించాడు. అయితే బ్యాంకు సిబ్బందికి అనుమానం వచ్చి ఇది మోసం కావచ్చని అప్రమత్తమయ్యారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హేమంత్‌ను బ్యాంక్ పార్కింగ్ లోపలనే అదుపులోకి తీసుకున్నారు. హేమంత్ కుమార్ మునెప్పపై గ్రాండ్ లార్సెనీ , యటెంప్టెడ్ గ్రాండ్ లార్సెనీ, ఫార్చ్యూన్ టెల్లింగ్‌కు సంబంధించిన రెండు కేసులు నమోదయ్యాయి.
ఈ మోసానికి సంబంధించి బాధితులెవరైనా ఉంటే, వారు న్యాసావ్ కౌంటీ సెకండ్ స్క్వాడ్‌ను 516-573-6200 నంబర్‌కు లేదా 911కు కాల్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
