కెన్సింగ్టన్ డిప్యూటీ మేయర్ గా భీమవరం యువకుడు
చాలామందికి సాధ్యం కానిది.. అతి తక్కువమంది చేయగలిగిన పనిని చేశాడు భీమవరానికి చెందిన యువకుడు. అతడి పేరు ఆర్యన్ ఉదయ్ ఆరేటి.
By: Tupaki Desk | 23 May 2025 9:37 AM ISTచాలామందికి సాధ్యం కానిది.. అతి తక్కువమంది చేయగలిగిన పనిని చేశాడు భీమవరానికి చెందిన యువకుడు. అతడి పేరు ఆర్యన్ ఉదయ్ ఆరేటి. ఈ అచ్చతెలుగు యువకుడు సాధించిన గొప్ప విషయం ఏమంటే.. బ్రిటన్ లోని రాయల్ బరో కెన్సింగ్టన్, చెల్సియా డిప్యూటీ మేయర్ గా ఎంపిక కావటం. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రుకు చెందిన ఈ గోదారి యువకుడు భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.30 గంటల వేళ కొత్త పదవికి ప్రమాణ స్వీకారం చేశారు.
భీమవరంలోని ఇందుర్రు గ్రామానికి చెందిన ఆరేటి వీరాస్వామి.. గొబ్బెళ్లమ్మ మనమడే ఈ ఉదయ్. ఆయన తండ్రి వెంకట సత్యనారాయణ భీమవరంలోని ఒక ప్రముఖ విద్యా సంస్థకు ప్రిన్సిపల్ గా పని చేశారు. ఏడో తరగతి వరకు స్థానిక సెయింట్ మేరీ స్కూల్లో చదివిన ఆర్యన్ ఉదయ్.. టెన్సిస్ క్రీడ మీద ఉన్న ఆసక్తితో హైదరాబాద్ కు వెళ్లారు. అక్కడే ఇంటర్ వరకు చదివారు. భీమవరంలో డిగ్రీ.. నరసాపురంలో ఎంబీఏ పూర్తి చేసిన ఉదయ్.. ఎంఎస్ చేసేందుకు లండన్ వెళ్లారు. ఈ సందర్భంగా యూనైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం కార్యదర్శిగా వ్యవహరించారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆర్యన్ బ్రిటన్ లోని కన్సర్వేటివ్ పార్టీలో చురుగ్గా వ్యవహరించేవారు.
2018,2022లో వరుసగా రెండుసార్లు కన్సర్వేటివ్ పార్టీ తరఫున కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. రాయల్ బరో కెన్సింగ్టన్.. చెల్సియా కౌన్సిలర్ గా పని చేశారు. తాజాగా డిప్యూటీ మేయర్ గా ఎన్నికై అందరిని ఆకర్షిస్తున్నారు. 2026 వరకు ఆయనీ పదవిలో ఉండనున్నారు. ప్రస్తుతం యూకేలోని కన్సర్వేటివ్ పార్టీ ఇండియా విభాగానికి ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా.. యూరోప్ ఇండియా సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీకి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు.
ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. భారత మూలాలు ఉన్న బ్రిటన్ మాజీ అధ్యక్షుడు రిషి సునాక్ కు నమ్మకస్థుడిగా ఆయన్ను చెబుతారు. ఈ మధ్యనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును.. మెగాస్టార్ చిరంజీవిని లండన్ లో కలిశారు. బ్రిటన్ కు వెళ్లటానికి కారణం ఏమిటి? ఆ దిశగా అడుగులు ఎందుకు పడ్డాయని అడిగితే ఆయన నోటి నుంచి ఆసక్తికర సమాధానం వస్తుంది. హైదరాబాద్ లో టెన్నిస్ లో శిక్షణ పొందే వేళలో ఏర్పడిన పరిచయాలే తననను లండన్ దిశగా అడుగులు వేసేలా చేశాయని చెబుతారు. ఏమైనా తెలుగు ప్రాంతానికి చెందిన ఒక యువకుడు యూకేలో కీలక పదవిని చేపట్టటం తెలుగు వారికి సంతోషానికి గురి చేస్తుందనటంలో సందేహం లేదు.
