అమెరికాలో వెంటాడిన మృత్యువు.. పల్నాడు యువతి దుర్మరణం
ఉన్నత చదువుల కోసం.. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ తెలుగు యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
By: A.N.Kumar | 15 July 2026 6:52 PM ISTఅమెరికాలో మరో తెలుగు వెలుగు అర్ధాంతరంగా నిసిగిపోయింది. ఉన్నత చదువుల కోసం.. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ తెలుగు యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా, వినుకొండ మండలం, ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్న (27) న్యూజెర్సీలో జరిగిన కారు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ హృదయవిదారక ఘటనతో ఆమె స్వగ్రామంలోనే కాకుండా బంధువులు, స్నేహితుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టిన కారు
లభించిన సమాచారం ప్రకారం.. మంగళవారం ప్రసన్న తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఒక కార్యక్రమానికి హాజరై కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును అత్యంత బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో ప్రసన్న కారులోనే తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే కన్నుమూశారు.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న మిగిలిన ముగ్గురు స్నేహితులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు, సహాయక సిబ్బంది స్పందించి వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే వారి ప్రాణాలకేమీ ప్రమాదం లేదని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి.
రెక్కల కష్టంతో చదివించిన తండ్రి.. మధ్యలోనే ఆగిపోయిన కలలు
మక్కెన ప్రసన్న ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన యువతి. ఉమ్మడివరం గ్రామానికి చెందిన రైతు దంపతులు మక్కెన వెంకటేశ్వర్లు, గోవిందమ్మలకు ముగ్గురు సంతానం కాగా వారిలో ప్రసన్నే పెద్ద కుమార్తె. తమ కుమార్తె ఉన్నత స్థానంలో స్థిరపడాలని ఎన్నో ఆశలతో ఆ తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. ప్రసన్న 2022లో ఉన్నత విద్యాభ్యాసం ఎంఎస్ కోసం అమెరికా వెళ్లారు. అక్కడ మాస్టర్స్ విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం, ఉద్యోగ అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తుందనుకున్న కుమార్తె ఇలా అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి ఆక్రందనలు గ్రామస్థుల హృదయాలను కలచివేస్తున్నాయి.
భౌతికకాయాన్ని రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు
ఈ విషాద ఘటనపై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తక్షణమే స్పందించారు. ప్రసన్న తండ్రి వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి, తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న ఆయన ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రసన్న భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా అమెరికా నుండి భారతదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార యంత్రాంగంతో పాటు, భారత విదేశాంగ శాఖ, అమెరికాలోని తెలుగు సంఘాలు, అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తమ కుమార్తె పార్థివ దేహాన్ని త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేలా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కన్నీళ్లతో వేడుకుంటున్నారు.
ఆందోళన కలిగిస్తోన్న వరుస ప్రమాదాలు
ఇటీవల కాలంలో అమెరికా సహా వివిధ దేశాలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువత రోడ్డు ప్రమాదాలు.. ఇతర అనుకోని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పల్నాడు జిల్లాకు చెందిన మరో యువతి మృతి చెందడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆవేదన వ్యెక్తం అవుతోంది. ప్రసన్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖులు, గ్రామస్థులు, స్నేహితులు నివాళులర్పించారు.
