Begin typing your search above and press return to search.

అమెరికా టు యూకే.. తరలిపోతున్నారు..

ఎక్కడ స్వేచ్చ, స్వాతంత్య్రం, సమానత్వం, అవకాశాలు, ప్రశాంతత ఉంటుందో అక్కడికే అందరూ వెళ్లిపోతారు.

By:  Tupaki Desk   |   24 May 2025 6:00 PM IST
అమెరికా టు యూకే.. తరలిపోతున్నారు..
X

ఎక్కడ స్వేచ్చ, స్వాతంత్య్రం, సమానత్వం, అవకాశాలు, ప్రశాంతత ఉంటుందో అక్కడికే అందరూ వెళ్లిపోతారు. ఒకప్పుడు అమెరికా కలల సౌధంగా ఇండియన్స్ కు ఉండేది. అందుకే తెలుగువాళ్లు అందరూ అక్కడకు ఎగేసుకుంటూ వెళ్లిపోయి ఎంతో సాధించారు. కానీ రోజులు ఎప్పుడూ అలాగే ఉండవు కదా.. అమెరికా కూడా మారింది. వలసలతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది. ట్రంప్ లాంటి అధ్యక్షుడిని పుట్టించింది. ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్ తో అమెరికన్స్ నే అమెరికాలో ఉండని పరిస్థితులు దాపురించాయి. అక్కడ ట్రంప్ అస్థవ్యస్థ విధానాలతో ఇప్పుడు అమెరికన్లు కూడా ఆ దేశాన్ని వీడి ప్రపంచంలోనే పురాతన ప్రజాస్వామ్య దేశమైన బ్రిటన్ కు వలసపోతున్న దుస్థితి అమెరికాలో కనిపిస్తోంది. ఈ ట్రెండ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

అమెరికా నుంచి తరలిపోతున్నారు. ప్రపంచంలోనే పురాతన స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం యూకేకు వలసవెళుతున్నారు. అమెరికాలోని అనిశ్చితి, రాజకీయ మార్పులు, డొనాల్డ్ ట్రంప్ నిబంధనలు..ఆంక్షలు, విధానాలతో విసిగివేసారిన అమెరికన్లు తాజాగా సురక్షిత స్వేచ్ఛాయుత దేశమైన బ్రిటన్ కు వెళ్లిపోతున్నారు. అమెరికా రాజకీయాల్లో చోటు చేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో అమెరికన్లు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పౌరసత్వం కోసం అమెరికన్ల నుండి అపూర్వమైన స్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. తాజా నివేదికలు ఈ స్పష్టమైన మార్పులు సూచిస్తున్నాయి.

యూకే ఇమ్మిగ్రేషన్ విభాగం విడుదల చేసిన డేటా ప్రకారం, ట్రంప్ రెండవ దఫా అధ్యక్ష పదవిని చేపట్టే సమయంలో ముఖ్యంగా ప్రమాణ స్వీకారానికి ముందు , ఆ తర్వాత నెలల్లో అమెరికా పౌరుల నుంచి దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది కేవలం పెరుగుదల మాత్రమే కాదు.., ఒక రికార్డు స్థాయి పెరుగుదల అని విశ్లేషకులు చెబుతున్నారు.

"రాజకీయ అస్థిరత, సాంస్కృతిక విభజన , ప్రజాస్వామ్య విలువల పట్ల పెరుగుతున్న ఆందోళనల కారణంగా చాలామంది అమెరికన్లు ప్రత్యామ్నాయ నివాస, పౌరసత్వ మార్గాలను అన్వేషిస్తున్నారు" అని ఓ యూకే ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ tupaki.com కు వెల్లడించారు. "భాషా అనుకూలత, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు.. అమెరికాతో ఉన్న చారిత్రక సంబంధాల కారణంగా యూకే వారికి ఆకర్షణీయ గమ్యస్థానంగా మారింది," అని ఆయన పేర్కొన్నారు.

ఇది ట్రంప్ మొదటి పదవీకాలంలోనూ చూసిన ట్రెండ్‌ను గుర్తుకు చేస్తోంది. అయితే ఈసారి దరఖాస్తుల పరిమాణం మరింతగా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కొందరు అమెరికన్లు తమ భవిష్యత్తును మరో దేశంలో చూసే అవకాశాన్ని సూచిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఈ పరిణామానికి సామాజిక మాధ్యమాలు కూడా గణనీయంగా ప్రేరణగా మారాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారం అనంతరం #ExitUSA అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి రావడం, పలువురు సెలబ్రిటీలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, టెక్ ఉద్యోగులు వంటి వారు ద్వైపౌరసత్వం లేదా వలస అవకాశాలపై విచారణ చేయడం.. అమెరికా నుంచి అనువైన దేశాలకు తరలిపోవడంతో ఈ ట్రెండ్‌ను మరింత స్పష్టం చేస్తోంది.

యూకే ప్రభుత్వ అధికారులు ఈ పెరుగుదలను నిజమేనని అంగీకరించారు. ప్రతి దరఖాస్తును పరిశీలిస్తామని తెలిపారు. "మేము ప్రతీ దరఖాస్తును సమగ్రంగా, మెరిట్ ఆధారంగా పరిశీలిస్తాం" అని యూకే హోం ఆఫీస్ ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ ట్రెండ్ అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న విభజన, అనిశ్చితి వాతావరణాన్ని ప్రతిబింబించడంతో పాటు, రాజకీయ అసంతృప్తి ఉన్న వ్యక్తులకు యూకే ఒక గ్లోబల్ ఆశ్రయం గమ్యంగా నిలుస్తున్నదనే అంశాన్ని కూడా హైలైట్ చేస్తోంది.

ప్రపంచ వలస ధోరణులపై తాజా అప్‌డేట్స్‌ కోసం tupaki.com ను ఫాలో అవ్వండి.