వీసా ఒత్తిడికి మరో బలి: అమెరికాలో తెలుగు యువకుడి గుండె ఆగిపోయింది!
అమెరికా కల ఎందరో భారతీయుల జీవితాలను మారుస్తుంది. కానీ అదే కల శశికాంత్ రెడ్డి అనే యువకుడి విషయంలో పీడకలగా మారింది.
By: A.N.Kumar | 21 Feb 2026 10:58 AM ISTఅమెరికా కల ఎందరో భారతీయుల జీవితాలను మారుస్తుంది. కానీ అదే కల శశికాంత్ రెడ్డి అనే యువకుడి విషయంలో పీడకలగా మారింది. వీసా సమస్యలు.. లాటరీలో పేరు రాకపోవడం, స్వదేశానికి వెళ్లలేకపోవడం వంటి కారణాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ససికాంత్ ఫిబ్రవరి 16న గుండెపోటుతో కన్నుమూశారు.
ఎనిమిదేళ్ల పోరాటం.. రెండు మాస్టర్స్ డిగ్రీలు
శశికాంత్ రెడ్డి 2018లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ పట్టుదలతో రెండు మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగ రంగంలో రాణించేందుకు ప్రయత్నించారు. అయితే అమెరికాలో శాశ్వతంగా లేదా దీర్ఘకాలం పనిచేయడానికి అవసరమైన హె-1బీ వీసా ఆయనకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అదృష్టం కలిసిరాక లాటరీలో ఆయన పేరు ఎంపిక కాలేదు. వీసా స్థితి ప్రమాదంలో పడుతుందన్న భయంతో, గత ఎనిమిదేళ్లుగా ఆయన కనీసం ఒక్కసారి కూడా భారత్‌కు రాలేకపోయారు.
కన్నవారిని చూడని కళ్లు.. మూతబడ్డాయి
ఎనిమిదేళ్ల కాలం అంటే తక్కువ సమయం కాదు. తన కళ్ల ముందే స్నేహితులు సెటిల్ అవుతుంటే తను మాత్రం ఇంకా వీసా నిబంధనల చుట్టూ తిరగడం శశికాంత్‌ను తీవ్రంగా కలచివేసింది. అన్నిటికంటే ముఖ్యంగా తన కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులను కలవలేకపోవడం ఆయనను కుంగదీసింది. "ఆయనపై ఎవరూ ఒత్తిడి చేయలేదు.. కానీ తన కెరీర్ పట్ల ఉన్న అనిశ్చితి, వరుస నిరాశలు ఆయనను మానసికంగా దెబ్బతీశాయి" అని ఆయన స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విషాదకర అంత్యం
ఫిబ్రవరి 16న ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో శశికాంత్‌ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 30 ఏళ్ల ప్రాయంలోనే ఆయన గుండె ఆగిపోయింది. ఉన్నత స్థితిలో కొడుకు తిరిగి వస్తాడని ఆశించిన ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు ఆయన మృతదేహాన్ని పంపించాల్సిన దుస్థితి ఏర్పడింది.
సహాయం కోసం స్నేహితుల పిలుపు
శశికాంత్ మృతదేహాన్ని భారత్‌కు తరలించడానికి.. ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి స్నేహితులు నిధుల సేకరణ ‘గో ఫండ్ మీ ’ వంటివి చేపట్టారు. అమెరికాలోని తెలుగు సంఘాలు కూడా ఈ విషయంలో చొరవ చూపుతున్నాయి.
ఈ ఘటన అమెరికాలో ఉంటున్న వేలాది మంది భారతీయ యువత ఎదుర్కొంటున్న వీసా స్ట్రెస్ ను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్ కోసం దశాబ్దాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ తో వీసా స్టాంపింగ్ సమస్యల వల్ల ఇంటికి వెళ్లలేని దుస్థితి. లేఆఫ్స్ భయం.. వీసా గడువు ముగిసిపోతుందన్న ఆందోళనతోనే ఇలాంటి ఉపద్రవాలు వచ్చిపడుతున్నాయి. . శశికాంత్ మరణం కేవలం ఒక వ్యక్తి మరణం కాదు.. వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల సమిధలవుతున్న యువత ఆక్రందనకు ప్రతిబింబంగా చెప్పొచ్చు.
