Begin typing your search above and press return to search.

అమెరికాలో పెళ్లి మోసం: దోషిగా తేలిన భారతీయుడు ఆకాష్ ప్రకాష్

అమెరికాలో గ్రీన్ కార్డ్ సంపాదించడానికి పెళ్లి మోసానికి పాల్పడిన కేసులో 29 ఏళ్ల భారతీయ పౌరుడు ఆకాష్ ప్రకాష్ మక్వానా దోషిగా ఒప్పుకున్నాడు.

By:  Tupaki Desk   |   7 Jun 2025 9:26 AM IST
అమెరికాలో పెళ్లి మోసం:  దోషిగా తేలిన భారతీయుడు ఆకాష్ ప్రకాష్
X

అమెరికాలో గ్రీన్ కార్డ్ సంపాదించడానికి పెళ్లి మోసానికి పాల్పడిన కేసులో 29 ఏళ్ల భారతీయ పౌరుడు ఆకాష్ ప్రకాష్ మక్వానా దోషిగా ఒప్పుకున్నాడు. ఈ కేసు దర్యాప్తులో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కీలక పాత్ర పోషించింది.

వీసా గడువు ముగిసినా అమెరికాలోనే..

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మక్వానా నవంబర్ 23, 2019న జె-1 నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసాతో అమెరికాకు వచ్చాడు. ఈ వీసా ఏడాది పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుందని తెలిసినా, నవంబర్ 24, 2020న వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అతను అమెరికాలోనే ఉండిపోయాడు.

గ్రీన్ కార్డ్ కోసం పెళ్లి కుట్ర

2021 ఆగస్టులో మక్వానా అమెరికన్ పౌరురాలు కేలీ అన్న్ హఫ్‌ను వివాహం చేసుకోవడం ద్వారా గ్రీన్ కార్డ్ పొందాలనే లక్ష్యంతో $10,000కి ఒప్పందం చేసుకున్నాడు. సెప్టెంబర్ 3, 2021న వారి వివాహం జరిగింది. అయితే, వారు కలిసి నివసిస్తున్నట్లు చూపించడానికి ఒక నకిలీ అద్దె ఒప్పందాన్ని సృష్టించారు. అపార్ట్‌మెంట్ మేనేజర్ సంతకం కూడా నకిలీదని మక్వానా అంగీకరించాడు. దీంతో అతను 'అగ్రవేటెడ్ ఐడెంటిటీ థెఫ్ట్' (Aggravated Identity Theft) కు పాల్పడ్డాడని ఒప్పుకున్నాడు.

ఒక మోసం విఫలమైతే మరో మోసం

పెళ్లి మోసం ద్వారా గ్రీన్ కార్డ్ లభించకపోవడంతో, మక్వానా USCISకి I-360 ఫారమ్‌ను దాఖలు చేశాడు. ఇందులో తాను కేలీ అన్న్ హఫ్ చేతిలో గృహహింసకు గురయ్యానని, భావోద్వేగ వేధింపులకు గురయ్యానని తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఈ తప్పుడు పిటిషన్ ద్వారా అమెరికాలో మరింత కాలం ఉండాలని, తన గ్రీన్ కార్డ్ అవకాశాలను పెంచుకోవాలని అతని ఉద్దేశం.

ఇతరులపైనా చర్యలు

ఈ కేసులో మక్వానా భార్య కేలీ అన్న్ హఫ్ (28) కూడా పెళ్లి మోసం, తప్పుదోవ పట్టించే ముడుపుల కింద ఫిబ్రవరి 20, 2025న దోషిగా ఒప్పుకుంది. ఆమెకు జూన్ 12, 2025న శిక్ష ఖరారవుతుంది. ఆమె సోదరుడు జోసెఫ్ సాంచెజ్ (33) కూడా పెళ్లి మోసం కుట్రలో పాలుపంచుకున్నట్లు ఒప్పుకుని, మే 30, 2025న శిక్షను ఎదుర్కొంటున్నాడు.

తీవ్ర శిక్షలు, దేశ బహిష్కరణ

మక్వానాకు సెప్టెంబర్ 26, 2025న శిక్ష ఖరారు కానుంది. అతనికి జైలు శిక్ష, జరిమానాలతో పాటు అమెరికా నుండి దేశ బహిష్కరణ చేసే అవకాశమూ ఉంది.

USCIS ప్రతినిధులు మాట్లాడుతూ, అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ పట్ల గౌరవం అవసరమని, దీన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎవరైనా ఇమ్మిగ్రేషన్ మోసం గురించి సమాచారం ఇవ్వాలనుకుంటే USCIS టిప్ ఫారమ్ ద్వారా అందించాలని కోరారు.