Begin typing your search above and press return to search.

₹100 కోట్ల ఓ ఎన్ఆర్ఐ కథ డబ్బే శాశ్వతమా?

ఎందుకంటే అతని వద్ద ₹100 కోట్లకు పైగా సంపద ఉంది. అయినా మనసులో శాంతి లేదు, సంతోషం లేదు.

By:  Tupaki Desk   |   16 Dec 2025 1:21 PM IST
₹100 కోట్ల ఓ ఎన్ఆర్ఐ కథ డబ్బే శాశ్వతమా?
X

డబ్బు ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుందనేది మనలో చాలామందికి ఉన్న బలమైన నమ్మకం. కోట్ల రూపాయల ఆస్తి, విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన కార్లు, ప్రపంచం చుట్టే ప్రయాణాలు.. ఇవన్నీ ఉంటే ఇక జీవితంలో కోరుకునేదేమీ ఉండదనుకుంటాం. కానీ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ ఎన్ఆర్ఐ (NRI) కథ ఈ భావనను పూర్తిగా చెరిపివేస్తుంది. ఎందుకంటే అతని వద్ద ₹100 కోట్లకు పైగా సంపద ఉంది. అయినా మనసులో శాంతి లేదు, సంతోషం లేదు.

జీవితంలో అన్నీ సాధించాడు.. కానీ..

ఈ కథలోని వ్యక్తి మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, చదువు పూర్తి చేసి విదేశాలకు వెళ్లాడు. అక్కడ ఐటీ రంగంలో స్థిరపడ్డాడు. కష్టపడి పనిచేశాడు. తెలివిగా పెట్టుబడులు పెట్టాడు. స్టార్టప్‌లలో భాగస్వామ్యంగా మారాడు. కొన్ని సంవత్సరాల్లోనే ఆర్థికంగా ‘సెట్’ అయిపోయాడు. మూడు పదులు దాటకముందే ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి, ‘అర్లీ రిటైర్మెంట్’ తీసుకున్నాడు. ఇదంతా ఆయన అనుకున్నట్లుగా జరిగింది. బయటికి చూస్తే ఇది డ్రీమ్ లైఫ్. కానీ లోపల మాత్రం పూర్తిగా భిన్నమైన కథ నడుస్తోంది.

ఆలోచింపజేస్తున్న ఎన్ఆర్ఐ మాటలు..

ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ‘డబ్బు సంపాదించడమే లక్ష్యంగా బతికాను. సాధించాక ఏమి చేయాలో తెలియలేదు. రోజులు ఖాళీగా మారాయి. కుటుంబంతో గడుపుతున్నా ఒంటరిగానే అనిపిస్తుంది. ఉదయం లేచినప్పుడు ఎందుకు లేచానో అర్థం కాకపోయింది.’ ఈ మాటల్లో ఏదో ఒక ఖాళీ స్పష్టంగా వినిపిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛ ఉన్నా, సరైన లక్ష్యం లేకపోవడం జీవితంలో శూన్యాన్ని తీసుకువస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి పనిలో బిజీగా గడిపే ఆ ఎన్ఆర్ఐ లోపల మాత్రం లోన్లీగా ఫీల్ అవుతున్నాడు.

మనసులో రేపుతున్న ప్రశ్న..

ఈ కథ మనకు ఒక కీలక ప్రశ్న వేస్తోంది. నిజంగా సంతోషం అంటే ఏంటి? డబ్బేనా? లేక దాని కంటే లోతైనదేదైనా ఉందా? మన సమాజంలో ‘ఎంత సంపాదించావు?’ అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ‘ఎంత సంతోషంగా ఉన్నావు?’ అనే ప్రశ్న చాలా అరుదుగా అడుగుతాం. ఈ వైరల్ కథ ఆ లోటును చూపిస్తోంది. డబ్బు అవసరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది భద్రత ఇస్తుంది. ఎంపికల స్వేచ్ఛ ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. కానీ అదే డబ్బు జీవితం అర్థాన్ని ఇవ్వలేదు. ఒకరికి ఉపయోగపడుతున్నామనే భావన, ఒక పనిలో అర్థం కనిపించడం, మనుషులతో బంధాలు.. ఇవే సంతోషానికి అసలు మూలాలు అని మానసిక నిపుణులు పదే పదే చెబుతున్నారు.

ఈ NRI తన కథ ద్వారా అదే అంగీకరిస్తున్నాడు. ‘డబ్బు ఫ్రీడమ్ ఇచ్చింది. కానీ పర్పస్ ఇవ్వలేదు. హ్యాపీనెస్ కొనలేకపోయింది’ అని అతను స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు తిరిగి ఏదైనా అర్థవంతమైన పని చేయాలని, సమాజానికి ఉపయోగపడే రంగంలో తన సమయాన్ని పెట్టాలని అనుకుంటున్నాడట. డబ్బుతో పాటు అర్థం కూడా అవసరమని ఆలస్యంగా అయినా గ్రహించాడు.

ఇది యువతకు హెచ్చరిక..

ఈ కథ ముఖ్యంగా యువతకు ఒక హెచ్చరిక. కెరీర్, జీతం, ఆస్తి ఇవన్నీ ముఖ్యమే. కానీ ఇవే జీవితం అనుకుంటే చివరికి ఖాళీ మిగులుతుంది. లక్ష్యాలు డబ్బుతో మొదలవ్వొచ్చు, కానీ అక్కడితో ముగియకూడదు. మనం ఎవరి కోసం, ఏం కోసం బతుకుతున్నామన్న ప్రశ్నకు సమాధానం వెతకకపోతే, ఎంత సంపాదించినా సంతోషం దొరకదు. ₹100 కోట్లు ఉన్నాయి. కానీ మనసులో లోన్లీగా ఉంటుంది. ఈ వైరల్ కథ చెబుతున్న పాఠం ఇదే డబ్బు జీవనానికి సాధనం మాత్రమే, లక్ష్యం కాదు. జీవితం అర్థవంతంగా ఉండాలంటే సంపదతో పాటు సంతృప్తి కూడా అవసరం.