Begin typing your search above and press return to search.

జగన్‌ గూటికి మరో వైఎస్‌ విధేయుడు

By:  Tupaki Desk   |   10 July 2015 4:53 PM GMT
జగన్‌ గూటికి మరో వైఎస్‌ విధేయుడు
X
ఏపీలో రాజకీయ సమీకరణాలు నెమ్మదిగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దివంగత మహానేత వైఎస్‌కు అత్యంత సన్నిహితులైన.. వీర విధేయులైన పలువురు నేతలు కాంగ్రెస్‌లో ఉండిపోవటం తెలిసిందే. జగన్‌ వైఖరిని తట్టుకోలేమన్న వాదనతో ఆయనకు దూరంగా ఉండే ప్రయత్నం చేశారు.

విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్‌ పార్టీని సీమాంధ్రులు సమాధి చేసిన నేపథ్యంలో.. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. పార్టీ మారేందుకు అవకాశం లేకపోవటం.. ఉన్న వారు అయితే తెలుగుదేశం లేదంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లటం తెలిసిందే.

జగన్‌ వైఖరిపై సందేహాలు ఉన్న వారు కాంగ్రెస్‌లో కొనసాగుతూ సమయం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. అయితే.. తాము అనుకున్నట్లుగా ఏపీలో రాజకీయ మార్పులు చోటు చేసుకోవటం అసాధ్యమని.. కనుచూపు మేర కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేని విషయం తెలీపోవటంతో అప్పుడొకరు.. అప్పుడొకరు చొప్పున కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్నారు.

ఈ మధ్యనే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన బత్ససత్యనారాయణ వైఎస్‌ జగన్‌ గూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరికొందరు నేతలకు జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన దళిత నేత.. మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 13న ఆయన జగన్‌ పార్టీలో చేరనున్నారు. డొక్కా చేరికతో ఏపీ కాంగ్రెస్‌ పార్టీలో కొద్దిపాటి నేతల్లో ఒకరైన డొక్క ఖాళీ ఆ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెట్టటం ఖాయం. డొక్కాతోనే ఆగిపోతుందా? మరికొందరు నేతలు పార్టీ నుంచి వెళ్లిపోతారా? అన్నది ఒక ప్రశ్నగా మారింది.