గజమాల కంటే పెద్ద బరువు మోయాలి తలసాని గారూ!

Fri Jul 23 2021 17:00:01 GMT+0530 (IST)

Minister of Cinematography Minister will focus on all these

ఔరా.. ఔరౌరా..! మరీ అంత బరువైన గజమాల దేనికి? ఏదైనా మంచి పనికి గజమాలతో సత్కారం చేస్తే తప్పేమీ కాదు. అయితే ఆ గజమాలను మోయడమే కాస్త ఇబ్బందికరం. సహజంగా వేసవి కాలంలో అయితే చెమటలు పట్టేస్తుంటే ఇలాంటి బరువులు మోయడం మరీ కష్టం..ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి ఓకే!అదంతా సరే కానీ.. ఇక్కడ మంత్రి తలసాని కి అంత పెద్ద గజమాల ఎందుకు వేశారు? అంటే దానికి సహేతుక కారణమే ఉంది. ఇప్పుడు పనంతా ఆయనతోనే... ముఖ్యమంత్రి కేసీఆర్.. ఐటీ మంత్రి కేటీఆర్ లతో కలిసి క్రైసిస్ లో ఉన్న టాలీవుడ్ ని కాపాడాల్సిన బాధ్యత సినిమాటోగ్రఫీ మంత్రివర్యులదే. అందుకే ఈ గజమాల సత్కారం.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తమ డిమాండ్లలో కొన్నిటిని నెరవేర్చినందుకు నైజాం ఎగ్జిబిటర్లు చాలా ఖుషీగా ఉన్నారు. ముఖ్యంగా చాలా కాలంగా ఊపిరాడనివ్వని సింగిల్ స్క్రీన్ల వరకూ పార్కింగ్ ఫీజును వసూలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రి గారి చొరవే కారణమని నమ్ముతున్నారు. అందుకే ఇలా ఎగ్జిబిటర్స్ .. తెలంగాణ ఫిలింఛాంబర్ సభ్యులు కలిసి గజమాలతో గౌరవనీయులైన మంత్రి వర్యులు తలసానిని సత్కరించారు.

అన్నట్టు ఈ గజమాలతో పాటు ఆయనకు చాంతాడంత లిస్ట్ కూడా ఇచ్చారు. అదేమిటి అంటే... కరోనా క్రైసిస్ కాలంలో కరెంటు బిల్లుల మోత మోగకుండా రద్దు చేయాలి. అలాగే ఆస్తి పన్ను (థియేటర్ల)ను లేకుండా చేయాలి. అలాగే  జీఎస్టీ భారాన్ని కూడా తగ్గించాలి. వీటన్నిటినీ మించి అదనపు షోలు బెనిఫిట్ షోలకు కూడా టిక్కెట్టు రేటు పెంచుకునే వెసులుబాటు కల్పించాలి. ఇలా కొన్ని నెరవేరని డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం ముందుంచారు. మరి వాటన్నిటినీ కూడా నెరవేరుస్తున్నామని మంత్రి వర్యులు ప్రామిస్ చేశారా లేదా..?  తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి వెసులుబాట్లు ఉన్నాయి? అన్నది తెలియాల్సి ఉంది.

అలాగే తెలంగాణ ఫిలింఛాంబర్ నుంచి మరికొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి. సాధ్యమైనంత తొందర్లోనే పూణే ఫిలింఇనిస్టిట్యూట్ తరహాలో ఒక మంచి ఫిలింఇనిస్టిట్యూట్ ని హైదరాబాద్ లో నెలకొల్పాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. అలాగే గచ్చిబౌళిలో యానిమేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని కేటీఆర్ మాటిచ్చారు. కానీ అది నెరవేరనే లేదు. ఇదిగో పులి అంటే అదిగో మేక! అన్న చందంగా ఉంది పరిస్థితి. మరి వీటన్నిటిపైనా సినిమాటోగ్రఫీ మంత్రి దృష్టి సారిస్తారేమో చూడాలి.