Begin typing your search above and press return to search.

మండలి ఖాళీలు.. టీఆర్ఎస్ లో బోలెడు ఆశావహులు

By:  Tupaki Desk   |   19 Jun 2021 12:30 AM GMT
మండలి ఖాళీలు.. టీఆర్ఎస్ లో బోలెడు ఆశావహులు
X
తెలంగాణ శాసనమండలిలో బోలెడు ఖాళీలున్నా కూడా వాటి భర్తీ ఆలస్యం అవుతూ నేతలకు పరీక్ష పెడుతోంది. ఇప్పటికే ఉన్న ఖాళీలకు తోడు తాజాగా మరో స్థానం ఖాళీ అయ్యింది. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన ప్రొఫెసర్ శ్రీనివాసురెడ్డి పదవీకాలం ముగిసింది. దీంతో ఈయనతో కలిపి ఏడు సీట్లు ఖాళీ అయినట్టు అయ్యింది. కరోనా లాక్ డౌన్ తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది.

కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఎన్నికల నిర్వహణపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఈసీ తేల్చిచెప్పింది. దీంతో టీఆర్ఎస్ ఆశావహుల పదవి కాంక్ష తీరేలా కనిపించడం లేదు. దీంతో ఆరు స్థానాలకు ఎన్నికలు ఎప్పుడూ వస్తాయో అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఆశావహులు. ఈలోగా టికెట్ ఖాయం చేసుకోవాలని నేతలు టీఆర్ఎస్ బాస్ వెంట పడుతున్నారు.

ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఒకటి అవడంతో ఈ స్థానంపై కూడా కన్నేశారు ఆశావహులు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి.. కేసీఆర్ నిర్ణయించే నేతకే దక్కనుంది. దీంతో ఎవరిని చాన్స్ వరిస్తుందోనని టీఆర్ఎస్ నేతల్లో చర్చ మొదలైంది.

ఇటీవల పదవీకాలం ముగిసిన నేతల్లో ఎవరినైనా గవర్నర్ కోటాలో పెద్దల సభకు పంపిస్తారన్న ప్రచారం టీఆర్ఎస్ లో జోరందుకుంది. ఈ రేసులో ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రముఖంగా వినిపిస్తోంది. ఈనెల మొదటివారంలోనే గుత్తా.. ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయ్యింది. దీంతో ప్రొటెం చైర్మన్ గా భూపాల్ రెడ్డిని నియమించారు సీఎం కేసీఆర్

ఇక మరోవైపు ఈ రేసులో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేరు వినిపిస్తోంది. గవర్నర్ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని కడియం శ్రీహరి పార్టీ అధినేత కేసీఆర్ ను కోరినట్లు తెలుస్తోంది. ఇక పదవీకాలం ముగిసిన ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది.

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయ ఇన్ చార్జ్ గా సుధీర్ఘకాలం పనిచేస్తుండడంతో తనకు మరోసారి గులాబీ బాస్ అవకాశం కల్పిస్తారనే ధీమాతో శ్రీనివాసరెడ్డి ఉన్నారు.