Begin typing your search above and press return to search.

వేల నవ్వుల సుత్తివేలు

By:  Tupaki Desk   |   16 Sep 2021 3:30 PM GMT
వేల నవ్వుల సుత్తివేలు
X
తెలుగు తెరపై చెరగని నవ్వుల సంతకం చేసిన హాస్యనటులలో సుత్తివేలు ఒకరు. తనదైన మేనరిజం తో ఆయన నవ్వుల పువ్వులు పూయించారు. ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. కృష్ణా జిల్లా మచిలీ పట్నం సమీపంలోని 'భోగిరెడ్డి పల్లి'లో ఆయన జన్మించారు. మొదటి నుంచి కూడా ఆయనకి చదువుపై కంటే నాటకాలపై ఎక్కువ ఆసక్తి ఉండేది. అందువలన ఆయన మనసంతా ఆ వైపుకు లాగుతూ ఉండేది. దాంతో స్నేహితులతో కలిసి ఆయన నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు.

చిన్నప్పటి నుంచి ఆయన చాలా సన్నగా .. పీలగా ఉండేవారు అందువలన ఆ ఊళ్లోని వాళ్లంతా ఆయనను సరదాగా 'వేలు' అని పిలుస్తుండేవారు .. ఆటపట్టిస్తూ ఉండేవారు. తన పర్సనాలిటీకి తగినట్టుగానే ఆయన స్టేజ్ పై హాస్య ప్రధానమైన పాత్రలను పోషిస్తూ ఉండేవారు. మంచి ఉద్యోగం వచ్చినప్పటికీ, నాటకాల కోసం ఆయన ఉద్యోగాన్ని వదులుకోవడం విశేషం. నాటకాల పట్ల తనకి గల ఇష్టానికి ఇది నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలా ఆయన నాటక ప్రదర్శనలిస్తూ జంధ్యాల వారి కంటపడ్డారు. అంతే అప్పటి నుంచి ఆయన దశ తిరిగిపోయింది.

స్టేజ్ పై ఆయన నటనను చూసిన జంధ్యాల తాను తీస్తున్న 'ముద్దమందారం' సినిమాలో ఒక వేషం ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఆయన నటనలో ప్రత్యేకత కారణంగా జంధ్యాల తన సినిమాల్లో ఆయనకి వరుస అవకాశాలు ఇస్తూ వెళ్లారు. ఆ పాత్రలన్నీ కూడా ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 'నాలుగు స్తంభాలాట' సినిమాలో ఆయన పాత్ర పేరు 'సుత్తి' .. అంతకు ముందు ఆయనను ఊళ్లో 'వేలు' అని పిలిచేవారు. అందువలన ఆయన పేరు 'సుత్తివేలు'గా మారిపోయింది.

జంధ్యాల కారణంగా సుత్తివేలు - శ్రీలక్ష్మీ జోడీకి అప్పట్లో ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేది. రేలంగి - గిరిజ, రాజబాబు - రమాప్రభ, పద్మనాభం - గీతాంజలి మాదిరిగా ఈ జంటకు విశేషమైన ఆదరణ లభించింది. ఒకానొక దశలో సుత్తివేలు లేని సినిమా అంటూ ఉండేది కాదు. అంతగా ఆయన నటుడిగా బిజీ అయ్యారు. సుత్తివేలుకి నవ్వించడమే కాదు, కన్నీళ్లు పెట్టించడం కూడా తెలుసు. 'ప్రతిఘటన' .. 'కలికాలం' సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు నటుడిగా ఆయన లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి.

తెలుగు కథల్లో .. పాత్రల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. తెలుగు తెరకి హాస్యనటుల తాకిడి ఎక్కువైంది. చిత్రపరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కి తరలి వచ్చేసింది. జంధ్యాలవారి నుంచి సినిమాలు లేవు. ఈ కారణాలుగా సుత్తివేలుకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఫలితంగా ఆయన తన చివరి రోజుల్లో ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. హాస్యనటుడిగా ఒకప్పుడు డేట్లు సర్దుబాటు చేయడానికి ఇబ్బంది పడిన సుత్తివేలు, ఆ తరువాత వేషాలు లేక అవస్థలు పడ్డారు. ఆ సమయంలో సీరియల్స్ లో నటిస్తూ రోజులు నెట్టుకొచ్చారు. ఈ రోజున ఆయన వర్ధంతి . ఈ సందర్భంగా మనసారా ఒకసారి ఆయనను స్మరించుకుందాం.