నాన్ స్టాప్ కామెడీకి కేరాఫ్ అడ్రెస్ .. శ్రీను వైట్ల

Fri Sep 24 2021 10:02:51 GMT+0530 (IST)

srinu vaitla Care of Address to Non Stop Comedy

టాలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్లలో శ్రీను వైట్ల ఒకరు .. కొంతకాలంగా ఆయన హిట్లను ఇచ్చి ఉండకపోవచ్చును. అంతమాత్రాన ఆయన ప్రతిభను తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే కేవలం తన టాలెంటుతో ఒక్కో ఇటుక పేర్చుకుంటూ .. ఒక్కో మెట్టూ కట్టుకుంటూ ఆయన తనదైన కోటను నిర్మించుకున్నారు .. స్టార్ డైరెకర్ అనిపించుకున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని స్టార్ హీరోలు ఉత్సాహపడేలా .. ఆసక్తిని చూపేలా చేశారు. ఒకానొక దశలో ఆయనకి ఫ్లాప్ అనేది ఎదురుపడటానికి భయపడింది.అలాంటి శ్రీను వైట్ల తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం .. 'కందులపాలెం' గ్రామంలో జన్మించారు. స్కూల్ ఏజ్ నుంచే ఆయన విపరీతంగా సినిమాలు చూసేవారు. కాలేజ్ ఏజ్ లోకి అడుగుపెట్టేసరికి తాను డైరెక్టర్ కావాలనే ఒక బలమైన నిర్ణయానికి వచ్చేశారు. దాంతో ఆ దిశగానే అడుగులు వేశారు. అలా ఆయన 'నీ కోసం' సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకి పరిచయమయ్యారు. రవితేజకు సోలో హీరోగా సరైన హిట్ ఇచ్చినది ఈ సినిమానే. ఇక ఆ తరువాత శ్రీను వైట్ల నుంచి వచ్చిన 'ఆనందం' యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది.

ఈ సినిమా నుంచే శ్రీను వైట్ల కామెడీకి పెద్ద పేట వేయడం మొదలైంది. కుర్రాళ్లంతా తాగేసి .. ఇంటి ఓనర్ అయిన ఎమ్మెస్ నారాయణను అల్లరిపెట్టే ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్. ఇక ఆ తరువాత ఆయన చేసిన 'వెంకీ' సినిమా కూడా విడుదలైన ప్రతి ప్రాంతంలో భారీ వసూళ్లను రాబట్టింది. పోలీస్ డిపార్టుమెంటులో చేరడానికి వెళుతూ హత్య కేసులో ఇరుక్కునే నలుగురి కుర్రాళ్ల కథ ఇది. ఈ సినిమాలో మాస్టర్ భరత్ కాంబినేషన్లోని ట్రైన్ ఎపిసోడ్ ను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అంతగా ఆ ఎపిసోడ్ నాన్ స్టాప్ గా నవ్విస్తుంది.

ఇక శ్రీను వైట్ల సినిమా అంటే బ్రహ్మానందం ఉండటం తప్పనిసరి అయింది. 'ఢీ' సినిమాలో విష్ణు - బ్రహ్మానందం 'రెఢీ' సినిమాలో రామ్ - బ్రహ్మానందం 'నమో వెంకటేశ'లో వెంకీ - బ్రహ్మానందం కాంబినేషన్లో ఆయన ఆవిష్కరించిన కామెడీని చూడటానికి అదే పనిగా థియేటర్ల చుట్టూ తిరిగినవారు ఉన్నారు. అందువల్లనే ఆ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలబడ్డాయి. ఇక ఒక వైపున బ్రహ్మానందం .. మరో వైపున ఎమ్మెస్ నారాయణ పాత్రలను మహేశ్ బాబుతో లింక్ చేసి 'దూకుడు' సినిమాలో ఆయన చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.

'దూకుడు' సినిమా నిన్ననే పదేళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా జంధ్యాల .. ఈవీవీ తరువాత తెలుగు తెరపై నవ్వుల పూలు పూయించిన దర్శకులలో శ్రీను వైట్ల ముందు వరుసలో కనిపిస్తారు. ఆ తరువాత సినిమాల్లో కామెడీ పాళ్లు తగ్గడం వల్లనే తాను పరాజయాలను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పిన శ్రీను వైట్ల పూర్వ వైభవాన్ని అందుకుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన సక్సెస్ కావాలని కోరుకుందాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయనకి శుభాకాంక్షలు తెలియజేద్దాం.