వెండితెర మేరునగధీరుడు.. సత్యజిత్ రే!

Mon May 03 2021 08:00:02 GMT+0530 (IST)

satyajit ray hundredth birthday

చరిత్ర మహోన్నతులను సృష్టిస్తుంది. అయితే.. చరిత్ర కడుపున పురుడుపోసుకోవడమన్నది కోరుకుంటే జరిగేది కాదు. దానంతటదే జరగాలి. తమదైన ప్రత్యేకత చాటుకున్నప్పుడు.. వర్తమానంతోపాటు భవిష్యత్ కూ మార్గదర్శులు అయినప్పుడు.. సగర్వంగా వారికోసం ప్రత్యేక పేజీలను కేటాయిస్తుంది చరిత్ర. భారతీయ సినీ చరిత్రలో అలాంటి మార్గదర్శి సత్యజిత్‌రే! ఇవాళ ఆయన వందవ పుట్టినరోజు. ఈ శతాబ్ధి జయంత్యుత్సవాల వేళ సత్యజిత్ రే కెమెరా కన్ను లోతు ఎంతో పరిశీలించే ప్రయత్నం చేయడం అవసరం.సినీ రంగంలోకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు.. పోతుంటారు. కొందరు తమదైన ముద్రవేస్తుంటారు. కానీ.. మరికొందరు ఉంటారు. వారు మహోపాధ్యాయులుగా మిగిలిపోతారు. వారి జీవితం మొదలు.. ప్రతీ విషయం భావితరాలకు మార్గనిర్దేశనం చేస్తుంటాయి. అలాంటి వారిలో అగ్రగణ్యుడు తొలితరం భారతీయ ఫిల్మ్ మేకర్ సత్యజిత్ రే.

కోల్‌కతాలో జన్మించిన రే.. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలతో ప్రభావితమయ్యాడు. ఆయన ఠాగూర్ యొక్క శాంతి నికేతన్ విద్యార్థి కూడా. ఒక అడ్వర్టైజ్ మెంట్ సంస్థలో విజువలైజర్‌గా కెరీర్ మొదలు పెట్టిన సత్యజిత్ ను సినిమాల్లోకి నడిపించిందో ఇటాలియన్ చిత్రం. 1948లో వచ్చిన ‘సైకిల్ థీవ్స్’ ఆయన్ను అమితంగా ప్రభావితం చేసింది. ఒక పనిమీద లండన్ వెళ్లినప్పుడు అక్కడ చూశాడీ సినిమా. ఆ సినిమా చూసిన తర్వాత తన ఆలోచనలు ఆకాశంలో విహరించడం మొదలు పెట్టాయి. అలా తాను కూడా ఫిల్మ్ మేకర్ కావాలని నిర్ణయించుకున్నారు.

భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత.. ఏ మాత్రం సినిమా అనుభవం లేని కొత్త నటీనటులతో టెక్నీషియన్స్ తో ‘పాథర్ పంచాలి’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు సత్యజిత్ రే. అయితే.. అనుకున్నంత సులువుగా ఏమీ జరగలేదు. ఎలాంటి అనుభవం లేని వారితో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ పట్టు వదలకుండా సినిమా చిత్రీకరణ కొనసాగించారు. మొత్తానికి సినిమా పూర్తికావడానికి 5 ఏళ్లు పట్టింది!

సామాజిక-వాస్తవికత ఇతివృత్తంతో కొనసాగిన ఈ మూవీ 1955లో విడుదలైంది. కథతోపాటు అద్భుతమైన కథనం అందరినీ కదిలించింది. సత్యజిత్ ‘పాథర్ పంచాలి’ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఈ ఫెస్టివల్ లో బెస్ట్ హ్యూమన్ డాక్యుమెంటరీ అవార్డు సొంతం చేసుకుంది. అదేవిధంగా.. OCIC అవార్డును కూడా దక్కించుకుంది. ఆ విధంగా తొలి సినిమాతోనే.. ప్రపంచ సినీ చరిత్రలోనే తనదైన ముద్ర వేశారు సత్యజిత్.

ఆ తర్వాత రే తీసిన ప్రతీ సినిమా కూడా సామాజిక-వాస్తవిక అంశాలను ప్రతిబింబిస్తూనే తెరకెక్కడం గమనించాల్సిన అంశం. అపరాజితో అపూర్ సంసార్ చారులత దేవి నాయక్ అగుంటక్ ఘనాశత్రు జల్సాఘర్ వంటి ఎన్నో అద్భుతమైన కళాఖండాలను తెరకెక్కించారు. అయితే.. రే తన సినిమాలన్నీ బెంగాలీలోనే రూపొందించారు. దిగ్గజ బెంగాలీ నటుడు సౌమిత్రా ఛటర్జీతో కలిసి ఆయన 14 చిత్రాలను తెరకెక్కించారు. సత్యజిత్ తీసిన ఏకైక హిందీ చిత్రం శత్రంజ్ కే ఖిలారి.

ఆయన టేకింగ్ అప్పట్లోనే ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసేది. కేవలం సక్సెస్ పర్సంటేజ్ తోనే కాకుండా.. ఆయన ఎంచుకున్న సామాజిక ఇతివృత్తాలు కథను నడిపించిన విధానం కూడా అత్యద్భుతం. అందుకే.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆయన అధ్యాయం ఎప్పటికీ నిత్యనూతనం.

కళారంగానికి సత్యజిత్ రే చేసిన సేవలకు గానూ.. 1958 లోకేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 1965 లో పద్మ భూషణ్ 1984 లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 1976 లో పద్మ విభూషణ్ అవార్డు అందుకోవడంతోపాటు 1992లో అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును సైతం సత్యజిత్ అందుకున్నారు. 1991లో అకాడమీ గౌరవ పురస్కారం కూడా స్వీకరించారు.

సత్యజిత్ రే కేవలం భారతీయ ఫిల్మ్ మేకర్స్ ను మాత్రమే కాదు.. విదేశాలకు చెందిన వారిని కూడా ఎంతగానో ప్రభావితం చేశారు. సత్యజిత్ పై ఉన్న అభిమానంతో.. అమెరికన్ ఫిల్మ్ మేకర్ వెస్ ఆండర్సన్ తన సినిమా ‘ది డార్జిలింగ్ లిమిటెడ్’ను రేకు అంకితం ఇచ్చారు. తొలితరం ఫిల్మ్ మేకర్ గా భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సత్యజిత్ రే.. 1992 లో కన్నుమూశారు. ఆయన మన మధ్య లేనప్పటికీ.. సత్యజిత్ వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పడంలో సందేహమే లేదు. సత్యజిత్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా.. ‘తుపాకీ’ ఘనంగా నివాళులు అర్పిస్తోంది.