కెలుకుతావ్.. అడిగితే కోప్పడతావ్.. ఇదేం లెక్క సామ్?

Thu Sep 23 2021 12:02:38 GMT+0530 (IST)

samantha new Posts are increase the curiosity

నిప్పు లేనిదే పొగ రాదన్నది పాత సామెతగా కొట్టి పారేద్దాం. కమ్మేస్తున్న ఊహాగానాల పొగను తేల్చేసే వీలున్నా.. అలాంటివేమీ చేయని చైతూ-సామ్ ల తీరు కొత్త చర్చకు తెర తీయటమే కాదు.. విడాకుల ఎపిసోడ్ తెలుగు టీవీ సీరియల్ మాదిరి మారింది. రోజుకో రచ్చ అన్న తీరులో.. సామ్ వ్యవహరిస్తున్న తీరు కూడా ఈ ఇష్యూ ఇంతలా చర్చకు కారణమవుతుందని చెప్పాలి. నిజంగానే విడిపోవాలని డిసైడ్ అయ్యాక.. దాన్ని దాచి పెట్టే కన్నా ఓపెన్ గా చెప్పేస్తే ఏమవుతుంది? అనవసరమైన అంచనాలు.. ఊహాగానాలు తగ్గుతాయి.తమ గురించి తాము చెప్పే వరకు ఎవరూ ఏమీ మాట్లాడకూడదన్నట్లుగా సెలబ్రిటీల తీరు కనిపిస్తూ ఉంటుంది. అలా అని వారేమైనా ఊరికే కూర్చుంటారా? తమ జీవితాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా తమ సోషల్ ఖాతాల్లో పోస్టులు పెట్టి.. కొత్త క్యురియాసిటీ పెంచేలా చేస్తారు. అలా పెంచిన తర్వాత.. ఎవరు మాత్రం మాట్లాడుకోకుండా ఉంటారు? అలా మట్లాడే క్రమంలో ఎదురుపడిన సదరు సెలబ్రిటీల్ని ప్రశ్నలు వేస్తే.. బుద్ది ఉందా? అన్న మాటలు కొత్త వివాదంగా మారుతూ ఉంటుంది.

మిగిలిన సెలబ్రిటీల సంగతిని కాసేపు పక్కన పెడదాం. సమంత - నాగ చైతన్య వైవాహిక జీవితానికి సంబంధించి ఇటీవల వినిపిస్తున్న వార్తల గురించే మాట్లాడితే.. ఈ మొత్తం ఎపిసోడ్ ను ఇంతవరకు తీసుకొచ్చింది సామ్ అనే చెప్పాలి. చైతూ ఎప్పటిలానే తన దారిన తాను ఉంటున్నాడు. అనవసరమైన చర్చకు అతను అవకాశం ఇవ్వలేదు. సామ్ మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెట్టటం.. కొన్నిసార్లు డిలీట్ చేయటం.. మరికొన్నిసార్లు కంటిన్యూ చేయటం.. చెప్పి చెప్పనట్లుగా వ్యవహరించి చర్చకు తెర తీస్తున్నారు.
ఇటీవల తిరుమల దర్శనం విషయానికే వద్దాం. నిజంగానే.. తన వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురై.. వాటికి సంబంధించిన ఇష్యూల్లో ఉన్నప్పుడు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఒకవేళ వచ్చినా.. అడిగేవాళ్లు అడుగుతారు.. చెప్పకుండా మౌనంగా తన దారిన తాను వెళ్లిపోతే సరిపోతుంది. కానీ.. సామ్ అలా చేయట్లేదే? నాగ చైతన్య విషయానికే వద్దాం. తన సోషల్ మీడియా ఖాతాల్ని చూస్తే.. తాను.. తన సినిమాలు తప్పించి వ్యక్తిగత విషయాల్ని ఎక్కడా ప్రస్తావించడు. ఆ మాటకు వస్తే సినిమాలకు సంబంధం లేని ఫోటోల్ని పెద్దగా పోస్టు చేయడు. అలాంటప్పుడు అసలు వాదనకు అవకాశం ఏముంటుంది?
అందుకు భిన్నంగా చిట్టిపొట్టి బట్టలు వేసుకొని (అలా వేసుకోవటం తప్పని చెప్పట్లేదు).. తన ప్రైవేటు ముచ్చట్లను ఎప్పటికప్పుడు ప్రపంచానికి అదే పనిగా అప్డేట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఇవ్వటం నా ఇష్టం అంటే.. దాన్ని చూసి స్పందించినోడు.. వాడి ఇష్టం వచ్చినట్లుగా స్పందిస్తాడు.. దానికి వాడి ఇష్టమని ఊరుకోవాలే కానీ తిట్టి పోయకూడదు. ‘ఫ్రీ సోల్’ పేరుతో క్లాసులు పీకే కొందరు సెలబ్రిటీలు.. తమ మాటల వరకే కానీ.. అదే పనిని మరెవరైనా చెప్పే ప్రయత్నంచేస్తే మాత్రం తిట్టి పోస్తారు. సామ్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. తన పాటికి తాను పోస్టులతో కెలికేసే సామ్.. అదే పని వేరే వాళ్లు చేస్తానంటే మాత్రం అస్సలు ఊరుకోరు.

సామ్ లాంటి సూపర్ సెలబ్రిటీలు.. సోషల్ మీడియాలో తనకు తానుగా పోస్టులు పెట్టే ఛాన్స్ ఉండదు. వారి టీం పెడుతుంటారు. వారు పెట్టే ప్రతి పోస్టు విషయంలోనూ సదరు సెలబ్రిటీల సూచనల్ని పక్కాగా పాటిస్తుంటారు. ఇలాంటివేళ.. మొన్న సమంత పోస్టు చేసిన ఒక పోస్టులో నాగ్ మామ బదులుగా నాగార్జున అని పేర్కొనటం.. తర్వాత డిలీట్ చేయటం చూసినప్పుడు.. దీన్ని కెలకటం కాక మరేమంటారు? ఇటీవల కాలంలో తన గురించి అదే పనిగా చర్చ జరుగుతుందని.. తన విడాకుల అంశంపై అదే పనిగా వార్తలు వస్తున్నప్పుడు.. దానిపై క్లారిఫికేషన్ ఇచ్చే ఆలోచన లేనప్పుడు.. నాగ చైతన్య మాదిరి కామ్ గా ఉండాలే కానీ.. అందుకు భిన్నంగా పోస్టుల మీద పోస్టులు పెట్టేసే తీరును కాస్త తగ్గిస్తే మంచిది. అలా కుదరదంటే.. తనకు నచ్చినట్లు.. తోచినట్లు చేసినట్లే.. ఎవరైనా తమకు తోచినట్లు స్పందిస్తే.. దాన్ని లైట్ తీసుకోవాలే కానీ.. చెలరేగిపోకూడదన్న చిన్న లాజిక్ ను సామ్ మర్చిపోకుండా ఉంటే మంచిదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.