నా బాయ్ ఫ్రెండ్ సూసైడ్ పై సీబీఐ దర్యాప్తు చేపట్టండి : రియా చక్రవర్తి

Thu Jul 16 2020 17:00:01 GMT+0530 (IST)

CBI probe into my boyfriend's suicide: Riya Chakraborty

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. గత నెల 14న సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సుశాంత్ డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని మొదట అనుకోగా.. రోజులు గడుస్తున్న కొద్దీ సుశాంత్ మరణంపై నెటిజన్లు అనేక అనుమానాలు లేవనెత్తుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖులపైన.. ఇండస్ట్రీ మాఫియాపైనా.. నెపోటిజం పైనా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా సుశాంత్ ది సూసైడ్ కాదని హత్య అని.. కేసును సీబీఐ దర్యాప్తుకి అప్పగించాలని డిమాండ్ చేసారు.ఈ క్రమంలో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సుశాంత్ మృతి చెంది నెల రోజులు పూర్తయిన సందర్భంగా అతని రియా చక్రవర్తి ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. 'నువ్వు లేవనే నిజాన్ని నమ్మలేక నా భావోద్వేగాలతో ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాను. నా హృదయంలోని అలజడి నన్ను ఇంకా కలవరపెడుతూనే ఉంది' అంటూ రియా చక్రవర్తి భావోద్వేగమైన పోస్ట్ పెట్టింది. ఇన్నాళ్ల మౌనం తర్వాత ఆమె తొలిసారిగా తన మనసులోని బాధను బయటపెట్టింది. ఇప్పుడు లేటెస్టుగా తన బాయ్ ఫ్రెండ్ మరణంపై మరో ట్వీట్ తో వచ్చింది రియా చక్రవర్తి.

రియా చక్రవర్తి ట్విట్టర్ వేదికగా తన బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు సీబీఐకి అప్పగించాలని సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షాని వేడుకుంది. ''గౌరవనీయులైన అమిత్ షా సార్.. నేను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని. సుశాంత్ ఆకస్మిక మరణం జరిగి ఇప్పటికి నెల రోజులు దాటింది. నాకు ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉంది. అయితే న్యాయం కోసం సీబీఐ విచారణను ప్రారంభించమని రెండు చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. సుశాంత్ ఇలాంటి స్టెప్ తీసుకోడానికి దారితీసిన ఆ ప్రెజర్ ఏంటని తెలుసుకోవాలని అనుకుంటున్నాను.. సత్యమేవజయతే'' అని ట్వీట్ చేసిన రియా చక్రవర్తి హోమ్ మినిస్టర్ అమిత్ షాని ట్యాగ్ చేసింది. దీనిపై నెటిజన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు రియాకి మద్ధతు తెలుపుతుండగా మరికొందరు మాత్రం 'నెల రోజులుగా గుర్తుకు రాని సీబీఐ.. సాక్ష్యాలు తారుమారైన తర్వాత గుర్తొచ్చిందా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.