అదే జరిగితే ఉద్యోగం చేసుకుంటా: నివేదా పేతురాజ్

Tue May 17 2022 12:11:39 GMT+0530 (IST)

nivetha pethuraj comments

నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తమిళనాడులో జన్మించిన ఈ భామ దుబాయ్ లో పెరిగింది. విద్యాభ్యాసం అనంతరం మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నివేదా పేతురాజ్.. `ఒరు నా కూత్తు` అనే తమిళ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. `మెంటల్ మదిలో` మూవీ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసిన నివేదా.. స్టార్ హోదాను మాత్రం దక్కించుకోలేకపోయింది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన `అల వైకుంఠపురములో` సినిమాలో అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయినా నివేదా దశ తిరగలేదు. కానీ నటిగా మాత్రం మంచి మార్కులే వేయించుకుంది.

ప్రస్తుతం అడపా తడపా సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోన్న నివేద.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె వృత్తిపరమైన విషయాలే కాకుండా వక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను సైతం అందరితోనూ పంచుకుంది.

నివేదా మాట్లాడుతూ.. `హీరోయిన్ అవ్వడం కాదు.. నటి అనిపించుకోవడం గర్వంగా ఉంది . హీరోయిన్ గా సినిమాలు చేయకపోతే కెరీర్ ఉండదేమో అని చాలా మంది భయపడుతుంటారు. నాకు అలాంటి భయం లేదు. నేను ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. నటకు ప్రాధాన్యత ఉంటే ఎలాంటి పాత్రలైనా చేస్తాను. ఒకవేళ ఆఫర్లు రాకపోతే ఉద్యోగం అయినా చేసుకుంటా. ఆ సత్తా నాకు ఉంది.` అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే నటన పరంగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి అంటే తనకెంతో అభిమానమని ఆయన ఓవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు విలన్ గా హీరోయిన్ ఫాదర్ గా కూడా చేయడం తనను ఆశ్చరపరిచిందని నివేదా పేర్కొంది. అందుకారణంగానే ఆయనను ఎంతగానో ఆరాధిస్తానని వివరించింది. ఇక తనకు జర్నీ చేయడమంటే ఇష్టమని ఎంత ఒత్తిడిలో ఉన్నా ఒక కప్పు కాఫీతో రిలాక్స్ అయిపోతానని కూడా నివేదా తెలిపింది.

కాగా నివేదా పేతురాజ్ ఇటీవల `బ్లడీ మేరీ` అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది. ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా` వేదికగా విడుదలైన ఈ సిరీస్ మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఇక నివేదా నటించిన `విరాట పర్వం` మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి సాయి పల్లవి జంటగా నటించారు. అనేక వాయిదాల అనంతరం ఈ మూవీ జూలై 1న రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది.