ఇంత టెన్షన్ ఇంకెప్పుడూ పడకూడదు బాబోయ్!

Tue Apr 05 2022 14:00:01 GMT+0530 (India Standard Time)

news about varun tej ghani movie

'సినిమా తీసిచూడు .. దానిని రిలీజ్ చేసి చూడు' అనే మాటను ఇండస్ట్రీపై అవగాహన ఉన్న వాళ్లంతా ఒప్పుకుంటారు. ఒక సినిమా అన్ని పనులను పూర్తిచేసుకుని లొకేషన్ కి వెళ్లేవరకూ నమ్మకం ఉండదు. ఇక ఆ సినిమా షూటింగు తరువాత మిగతా పనులను పూర్తిచేసుకుని విడుదలయ్యే వరకూ అంతే టెన్షన్ ఉంటుంది. ఈ లోగా ఎన్ని మార్పులు జరుగుతాయనేది ఇక్కడ చాలామందికి తెలుసు. ఇక ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొదవేలేదు. మొదట సినిమా ఆగిపోయినా .. వాయిదాపడినా ఆ సినిమాకి పనిచేసిన వాళ్ల టెన్షన్ ఒక రేంజ్ లో ఉంటుంది.అలాంటి టెన్షన్ తాను ఒకసారి కాదు .. ఏడుసార్లు పడ్డానని 'గని' దర్శకుడు కిరణ్ కొర్రపాటి చెప్పాడు. వరుణ్ తేజ్ హీరోగా అల్లు బాబీ - సిద్ధూ ముద్ద నిర్మించిన ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా  ఇది ఆయనకు మొదటి సినిమా. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందింది. వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా విడుదలకి ముస్తాబై చాలా రోజులైంది. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడం వలన పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది.  ఎన్నిమార్లు వాయిదా పడిందనేది ఎవరూ గుర్తుపెట్టుకోలేదుగానీ 7మార్లు వాయిదాపడటం జరిగిందని కిరణ్ కొర్రపాటి చెప్పాడు.

కరోనా వలన .. కొన్ని ఇతర కారణాల వలన ఈ సినిమా  7 మార్లు వాయిదా పడింది. అలా వాయిదా పడిన ప్రతిసారి నేను చాలా మానసిక పరమైన ఒత్తిడికి లోనయ్యాను. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియక విసిగిపోయాను.  ఇలా విడుదల ఆలస్యం కావడం వలన నిర్మాతలపై భారం ఎక్కువ పడుతుందేమోనని ఫీలయ్యాను. అవసరమైతే ఓటీటీలో రిలీజ్ చేసేయమని నేనే చెప్పాను. ఇది థియేటర్లో చూడవలసిన సినిమా అనీ .. అందువలన వెయిట్ చేద్దామని నిర్మాతలే అన్నారు. అలాంటి నిర్మాతలు దొరకడం నిజంగా నా అదృష్టం.

ఈ నెల  8వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా చూసినవాళ్లు .. ఇది నిజంగానే థియేటర్లో చూడవలసిన సినిమా అని అంటే నా ప్రయత్నం .. మా నిరీక్షణ ఫలించినట్టే.  వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' సినిమాకి నేను డైరెక్షన్ డిపార్టుమెంటులో పనిచేశాను. నాకు డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తానని  తాను ఆ సమయంలో మాట ఇచ్చాడు. అలాగే ఈ సినిమాతో ఛాన్స్ ఇచ్చాడు. అందుకు నేను ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చాడు