Begin typing your search above and press return to search.

కొత్త కుర్రాడికి ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో

By:  Tupaki Desk   |   20 May 2020 2:30 PM GMT
కొత్త కుర్రాడికి ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో
X
ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని.. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే సినిమా షూటింగ్స్ నిలిచిపోతే.. నాని ఏమో వరుసగా సినిమాలు ఓకే చేస్తూ లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన వి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తన తదుపరి సినిమా 'టక్ జగదీశ్' సినిమా ఓకే చేసాడు నాని. నిన్నుకోరి సినిమాతో హిట్ అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ రూపొందుతుంది. హరీష్‌ పెద్ది, సాహు గారపాటి, షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ రీతూవర్మ తో పాటు మరో హీరోయిన్‌గా ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తున్నారు. తమన్‌ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

ఇక ‘టక్‌ జగదీష్‌’ తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో శ్యామ్‌ సింగ రాయ్‌ సినిమాను అనౌన్స్‌ చేశాడు నాని. అయితే తాజాగా మరో క్రేజీ సినిమాకు నాని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ‘బ్రోచేవారెవరురా’తో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఓ సినిమాకు కమిట్‌ అయినట్టు సమాచారం. వివేక్‌ చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చడంతో అతడితో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం వివేక్‌ పూర్తి స్క్రిప్ట్‌ను సిద్దం చేసే పనిలో పడ్డాడట. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించనుందట. ఇవేగాక తాజాగా శ్రీకాంత్ ఓడెల అనే కొత్త దర్శకుడికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. గతంలో సుకుమార్ వద్ద 'రంగస్థలం' చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఇటీవల కలసి శ్రీకాంత్ కథ చెప్పగా, అది నానికి బాగా నచ్చేసిందట. కథ కొత్తగా, ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో, వెంటనే మరో మాట లేకుండా ఈ ప్రాజెక్టు ఓకే చేసాడని తెలుస్తుంది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.