క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేయడంలో ఎవరైనా 'మైత్రీ' తర్వాతే..!

Fri Sep 10 2021 09:00:02 GMT+0530 (IST)

mythri movie makers Upcoming Movies

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల్లో 'మైత్రీ మూవీ మేకర్స్' ఒకటి. 2015 లో 'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ రంగంలో అగుడుపెట్టింది. అప్పటి నుంచి భారీ బడ్జెట్ సినిమాలు.. మధ్య మధ్యలో మీడియం రేంజ్ సినిమాలు నిర్మిస్తూ బ్యాలన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోలు - అగ్ర దర్శకులతో సూపర్ కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు. సినిమాలు ఎప్పుడు చేస్తారనేది పక్కన పెడితే.. అందరికీ అడ్వాన్సులు ఇచ్చి ప్రాజెక్ట్ ఓకే చేసి పెట్టుకుంటున్నారు.ప్రస్తుతం ఈ బ్యానర్ లో డజనుకు పైగా ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయంటేనే మైత్రీ నిర్మాతలు ఎంత బిజీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మహేష్ బాబు - పరశురామ్ పెట్లా కాంబినేషన్ లో రూపొందిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా 2022 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో 'పుష్ప' చిత్రాన్ని రెండు భాగాలుగా పాన్ ఇండియా స్థాయిలో రెడీ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ 'పుష్ప: ది రైజ్' పేరుతో ఈ ఏడాది క్రిస్మస్ కు రిలీజ్ అయితే.. 'పుష్ప 2' వచ్చే ఏడాది చివరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

చిరంజీవి - బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబోలో #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలో #NBK107 ప్రాజెక్ట్ ను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ #NTR31 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో 'అంటే సుందరానికీ!' సినిమా షూటింగ్ జరుగుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ తో కూడా మైత్రీ వారు ఓ సినిమా చేస్తున్నారు. అలానే విజయ్ దేవరకొండ - శివ నిర్వాణ కాంబినేషన్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ కు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. దీని కోసం బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ని లైన్ లోకి తీసుకొస్తున్నారని టాక్ ఉంది.

ఇదే క్రమంలో ఇప్పుడు తమిళ - హిందీ ఇండస్ట్రీలపై కూడా మైత్రీ నిర్మాతలు నవీన్ ఎర్నేని - వై. రవిశంకర్ కూడా దృష్టి పెట్టబోతున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ బ్యానర్ నుంచి దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుంది. ఏదేమైనా ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ లైనప్ చూస్తే టాలీవుడ్ లో ఇన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్న మరో నిర్మాణ సంస్థ లేదని చెప్పాలి.