Begin typing your search above and press return to search.

కేసు విచారణకు వెళ్లిన వారితో సెల్ఫీలేంట్రా బాబు!

By:  Tupaki Desk   |   16 Sep 2021 5:31 AM GMT
కేసు విచారణకు వెళ్లిన వారితో సెల్ఫీలేంట్రా బాబు!
X
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ జోరందుకుంది. డ్రగ్స్ డీలర్ గా ప్రచారం జరుగుతున్న కెల్విన్‌ చెప్పిన వివరాల ప్రకారం టాలీవుడ్ కు చెందిన ప్రముఖులను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పూరి జగన్నాధ్.. ఛార్మి.. రవితేజ మరియు రానాలను మరోసారి విచారించడం జరిగింది. ఇటీవలే వీరి విచారణ పూర్తి అయ్యింది. ఈడీ ఆఫీస్ కు వారు వెళ్తున్న సమయంలో మీడియా మరియు జనాలు వారి వెంట పడటం మొదలుకుని వారు లోనికి వెళ్లే వరకు కాస్త ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. తాజాగా ముమైత్‌ ఖాన్ కూడా విచారణకు హాజరు అయ్యింది. ముమైత్ ఖాన్‌ హాజరు అయిన సమయంలో కూడా అదే గందరగోళం. మీడియా వారితో పాటు సామాన్య జనాలు ముమైత్‌ ఖాన్ ను చూసేందుకు ఆమె ఏమైనా మాట్లాడుతుందో అనే ఉద్దేశ్యంతో ఆమె వెంట పడ్డారు. కాని ఆమె మాత్రం మౌనంగా ఈడీ ఆఫీస్ కు వెళ్లి పోయారు. అందరిని మాదిరిగానే ఈడీ అధికారులు ముమైత్ ను కూడా గంటల తరబడి విచారించారు.

కెల్విన్‌ తో మీకు సంబంధం ఏంటీ.. మీ నుండి అతడికి డబ్బులు ఏమైనా వెళ్లాయా అనే విషయాలను ముమైత్‌ ఖాన్ ను అడగడం జరిగింది. ముమైత్ ఖాన్ బ్యాంక్‌ అకౌంట్‌ డీటైల్స్‌ ఇతర విషయాలను కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తూ విచారణ చేపట్టినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ తీసుకునే అలవాటు పై కూడా ఆమెను ప్రశ్నించారని.. డ్రగ్స్ విషయంలో ఇంకా ఎవరు ఎవరు ఉన్నారు అంటూ చాలా ప్రశ్నలను ముమైత్ ఖాన్‌ ను అడిగినట్లుగా సమాచారం అందుతోంది. అందుకు ముమైత్‌ ఖాన్‌ సింపుల్ గా చాలా ప్రశ్నలకు నాకు తెలియదు అనే సమాధానం ఇచ్చిందట. కొన్ని ప్రశ్నలకు పొడి పొడిగా సమాధానాలు ఇవ్వడం జరిగిందట. మొత్తానికి ముమైత్ ఖాన్‌ పెద్దగా బయట పడ్డట్లుగా లేదు అంటున్నారు.

ఇక ముమైత్‌ ఖాన్‌ విచారణ పూర్తి చేసుకుని సాయంత్రం సమయంలో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న ఈడీ ఆఫీస్ ఎంప్లాయిస్‌ అంతా కూడా క్యూ కట్టారు. సెల్ఫీలు దిగేందుకు వారంత కూడా ఎగబడటంతో తప్పక ముమైత్ ఖాన్‌ దాదాపుగా గంట పాటు అక్కడ వారితో సెల్ఫీలకు అక్కడే ఉందట. కేవలం ముమైత్‌ ఖాన్‌ మాత్రమే కాకుండా అంతకు ముందు విచారణకు హాజరు అయిన పూరి జగన్నాద్‌.. రవితేజ... ఛార్మి మరియు రానాలతో కూడా ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారట. గంటల తరబడి ఒకొక్కరు చొప్పున సెల్ఫీలు తీసుకునేందుకు నిలబడి సెలబ్రెటీలు ఫొటోలకు ఫోజులు ఇవ్వాల్సి వచ్చిందట. కేసు విచారణకు వచ్చిన సమయంలో ఈ సెల్ఫీల గొడవ ఏంటీ అంటూ వారు అనుకున్నా కూడా ఈడీ కార్యాలయం ఎంప్లాయిస్ అవ్వడం వల్ల తప్పని సరి పరిస్థితుల్లో ఓపిక చేసుకుని గంటల తరబడి నిల్చున్నట్లుగా చెబుతున్నారు. ఈ విషయమై ఈడీ కార్యాలయం ఎంప్లాయిస్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.