Begin typing your search above and press return to search.

సైలెంట్ అయిపోయిన వాయిదా సినిమాలు..!

By:  Tupaki Desk   |   16 Jun 2021 10:30 AM GMT
సైలెంట్ అయిపోయిన వాయిదా సినిమాలు..!
X
కరోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం ఇప్పుడిప్పుడే త‌గ్గుతోంది. దీంతో చిత్ర పరిశ్రమలో కదలిక వచ్చింది. ఇప్ప‌టికే కొన్ని సినిమాలు షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరు నుంచి మరికొన్ని చిత్రాలు మొదలు కానున్నాయి. సీనియర్ హీరోలు సైతం సెట్స్ లో అడుగుపెట్టడాని రెడీ అవుతున్నారు. అయితే రెండు నెలలుగా మూతబడిన థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో లాక్‌ డౌన్‌ నిబంధనలు సడలించినా ప్రస్తుతం నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రిపూట కర్ఫ్యూ పూర్తిగా తొలగించిన తర్వాతే ఎవరైనా సినిమా విడుదల చేయాలనే విషయం గురించి ఆలోచిస్తారు. సాధారణంగా సెకండ్‌ షో వసూళ్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. అందుకే మూడు షో లతో థియేటర్లు నడిపించడానికి ఎవరూ ముందుకు రారు.. అలానే ఏ నిర్మాత కూడా తమ సినిమాలను విడుదల చేయాలనుకోరు.

ఈ నేపథ్యంలో నైట్‌ కర్ఫ్యూ ఎత్తేసిన తర్వాతే కొత్త చిత్రాలు విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వం సినిమా హాళ్లు తెరవడానికి పర్మిషన్ ఇచ్చినా, కొన్ని రోజులు మాత్రం 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు ప్రదర్శించాలనే కండిషన్ పెట్టొచ్చు. జూలై నెలలో తెలంగాణ రాష్ట్రంలో థియేటర్లు తెరుచుకుంటాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆగస్ట్ మొదటి వారంలో థియేటర్స్ ఓపెన్ చేసే చాన్స్ ఉందని అంటున్నారు.

ఇలా థియేట‌ర్స్ ఎప్పుడూ తెరుస్తారో తెలియక క‌రోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ పెట్ట‌కముందు వాయిదా పడిన సినిమాలన్నీ అయోమయంలో ఉన్నాయని తెలుస్తోంది. అంతా సిద్ధమై రిలీజ్ కి రెడీగా ఉన్న చాలా సినిమాలు కూడా సైలెంట్ అయిపోతున్నాయి. థియేట‌ర్స్ లోనే విడుదల అని అధికారిక ప్ర‌క‌ట‌ణ‌లు అయితే ఇచ్చారు కానీ.. ఆగ‌స్ట్ వ‌రకు ఈ స‌మ‌స్య‌కు ఓ ప‌రిష్కారం దొరికే అవ‌కాశం లేన‌ట్లుగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.