గూగుల్ సెర్చ్ లో ట్రెండింగ్ అవుతూ నిరంతరం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా ఏది? అన్నది పరిశీలిస్తే..హిందీ బెల్ట్ లో వాస్తవ సన్నివేశం ఇలా ఉంది. ఈ జాబితాలో తొలి పది ర్యాంకుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప : ది రూల్ (పుష్ప2-హిందీ) నంబర్ వన్ క్రేజ్ తో టాప్ స్లాట్ లో నిలిచింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందా? అంటూ ఉత్తరాది అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా మాలీవుడ్ ని మల్లూ అర్జున్ గా ఏల్తున్న టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం ఉత్తరాది పెహన్ షాగా మారాడు. పుష్ప -2తో సునాయాసంగా 1000 కోట్లు కొల్లగొట్టాలన్న పంతంతో పుష్ప రాజ్ దూకుడుగా దూసుకురాబోతున్నాడు. ప్రస్తుతం గూగుల్ సెర్చ్ సహా క్రేజ్ దృష్ట్యా అన్ని విధాలుగా పుష్ప2 చిత్రంపై అభిమానుల ఫోకస్ ఉందని సర్వే చెబుతోంది.
ఆ తర్వాత ఖిలాడీ అక్షయ్ కుమార్- పరేష్ రావల్- సంజయ్ దత్ లతో మల్టీస్టారర్ కేటగిరీలో తెరకెక్కనున్న హేరా ఫేరి 3 పై ఫోకస్ అమాంతం మళ్లిందని సర్వే చెబుతోంది. హేరాఫేరి 3 ప్రకటించక మునుపు సల్మాన్ భాయ్ టైగర్ 3 ట్రెండింగ్ లో ఉండేది. ఇప్పుడు టైగర్ మూడో స్థానంలో నిలుస్తోంది. సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఈ చిత్రంలో షారూఖ్ ఖాన్ అతిథిగా మెరవనున్నాడు. పఠాన్ ఘనవిజయంతో సల్మాన్ - షారూఖ్ కాంబినేషన్ మూవీగా టైగర్ 3 పైనా హైప్ అమాంతం పెరిగింది. వెయ్యి కోట్ల క్లబ్ టార్గెట్ గా వస్తున్న చిత్రమిది.
ఆ తర్వాత షారూఖ్ - అట్లీ మూవీ జవాన్ కి క్రేజ్ అనూహ్యంగా ఉంది. చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత సౌత్ - నార్త్ క్రాస్ ఓవర్ కథాంశంతో దేశభక్తి నేపథ్యంలో ఖాన్ చేస్తున్న ప్రయోగమిది. ఆ తర్వాత కార్తీక్ ఆర్యన్ నటించనున్న భూల్ భూలయ్యా 3 పైనా విపరీతమైన బజ్ ఉంది. భూల్ భులయా 2 బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పార్ట్ 3 పైనా ఆసక్తి నెలకొంది. అలాగే అజయ్ దేవగన్ భారీ చిత్రం -భోలా .. సల్మాన్ ఖాన్ - పూజా హెగ్డే జంటగా నటించిన `కిసీ కా భాయ్ కిసీ కా జాన్`.. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ.. గదర్ 2: ది కథా కంటిన్యూస్...బడే మియాన్ చోటే మియాన్ చిత్రాలపైనా ఉత్తరాది ఆడియెన్ లో ఆసక్తి నెలకొంది. వీటన్నిటితో పాటు ఇతర చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. మరి ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తాయో చూడాలి.
మహమ్మారి తర్వాత ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్న వేళ పుష్ప 2 సంచలనాలు సృష్టించడం ఖాయమన్న టాక్ బలంగా ఉంది. నిజానికి కోవిడ్ 19 విలయంతో ప్రజలు థియేట్రికల్ వినోదానికి దూరమయ్యారు. అందుకే ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. చాలా సినిమాలు ఇటీవల విడుదలైనా చాలా నీరసం ఎదురైన తర్వాత 2023 బాలీవుడ్ కు మంచి సంవత్సరంగా మారింది. షారూఖ్ ఖాన్ `పఠాన్ `బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా ఆడింది. ఇప్పుడు రణబీర్ కపూర్ -శ్రద్ధా కపూర్ నటించిన `తూ జూతీ మై మక్కర్` చిత్రం 100 కోట్ల రూపాయల మార్కును దాటింది. మునుముందు చాలా పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నందున హిందీ చిత్రాలకు ఈ సంవత్సరం బాగానే కనిపిస్తోంది. ఓర్మాక్స్ మీడియా ఇటీవల అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిందీ చిత్రాల జాబితాను షేర్ చేయగా ఈ జాబితాలో షారుఖ్ ఖాన్ - జవాన్... కార్తీక్ ఆర్యన్ -భూల్ భులయ్యా 3 చిత్రాలు సహా మరిన్ని క్రేజీ సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు ఈ ఏడాది విడుదల కానప్పటికీ వాటిని పెద్ద తెరపై చూసేందుకు అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.
జాబితాలో టాప్ 5 సినిమాలను పరిశీలిస్తే..
పుష్ప 2: ది రూల్ (హిందీ)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2: ది రూల్` ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. వాస్తవానికి ఇది తెలుగు సినిమా అయినప్పటికీ హిందీ వెర్షన్ కోసం ఉత్తరాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. `పుష్ప: ది రైజ్` బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఇప్పుడు అభిమానులంతా సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హేరా ఫేరి 3
అక్షయ్ కుమార్- సునీల్ శెట్టి -పరేష్ రావల్ తారాగణంగా నటించిన హేరా ఫేరి మూడవ భాగం (హేరాఫేరి 3) మోస్ట్ అవైటెడ్ జాబితాలో ఉంది. మోస్ట్ అవైటెడ్ రెండవ హిందీ చిత్రం కావడానికి కారణం ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ గా నటించడం కూడా. అధీరాగా కేజీఎఫ్ 2లో అద్భుత నటనతో ఆకట్టుకున్న సంజూ భాయ్ కలయికతో ఇప్పుడు హేరా ఫేరి 3 పై అంచనాలు అమాంతం పెరిగాయి.
టైగర్ 3
ఈ జాబితాలో సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూడో స్థానంలో నిలిచింది. ఇందులో కత్రినా కైఫ్ కూడా నటిస్తోంది. షారూఖ్ ఖాన్ అతిధిగా కనిపిస్తారు. పఠాన్ తర్వాత అభిమానులు మళ్లీ పెద్ద తెరపై ఒకే ఫ్రేమ్ లో ఖాన్ లను చూడటానికి ఆసక్తిగా ఉన్నారు.
జవాన్
పఠాన్తో అద్భుతమైన పునరాగమనం తర్వాత అభిమానులు షారుక్ ఖాన్ జవాన్ కోసం ఎదురు చూస్తున్నారు. సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార- విజయ్ సేతుపతి- సన్యా మల్హోత్రా తదితరులు నటించారు. జూన్ లో ఈ సినిమా విడుదల కానుంది.
భూల్ భూలయ్యా 3
భూల్ భూలయ్యా 2తో కార్తీక్ ఆర్యన్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఇప్పుడు మూడో భాగంలో రూహ్ బాబాగా తిరిగి సందడి చేయబోతున్నాడు. ఈ చిత్రం 2024 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలంగా వేచి ఉన్నప్పటికీ అభిమానులు ఇప్పటికీ ఉత్సాహంగా ఉన్నారు.