Begin typing your search above and press return to search.

చిన్న సినిమా టికెట్ పై అగ్ర‌ నిర్మాత అసంతృప్తి

By:  Tupaki Desk   |   26 Jun 2022 3:30 AM GMT
చిన్న సినిమా టికెట్ పై అగ్ర‌ నిర్మాత అసంతృప్తి
X
ద‌ర్శ‌కుడిగా మారిన అగ్ర‌నిర్మాత ఎం.ఎస్. రాజు ఇటీవ‌ల `7 డేస్ 6 నైట్స్` తో తిరిగి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. సుమంత్ అశ్విన్- రోహన్ హీరోలుగా... మెహర్ చాహల్- కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించారు. చిన్న సినిమాగా తెర‌కెక్కిన ఈ మూవీకి టాక్ బావుంద‌ని ఎం.ఎస్.రాజు అన్నారు. అయితే టికెట్ ధ‌ర‌ల‌తోనే చిక్కొచ్చి ప‌డింద‌ని ఆవేద‌న వెలిబుచ్చారు. చిన్న సినిమాలకు టికెట్ ధ‌ర‌ను త‌గ్గించాల‌ని కూడా ఆయ‌న సూచించారు.

సక్సెస్ మీట్ లో మెగా మేకర్ ఎంఎస్ రాజు మాట్లాడుతూ ``థియేటర్ కు వెళ్లి సినిమా చూశా. ప్రేక్షకుల స్పందన చూశాక చాలా సంతోషంగా అనిపించింది. రోజు రోజుకి ఆద‌ర‌ణ‌ పెరిగే చిత్రమిది. మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.. ఎమోషన్... ఈ రెండిటినీ జ‌నం బాగా ఎంజాయ్ చేశారు..`` అని తెలిపారు.

ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ఎంత కష్టం అనేది అందరికీ తెలుసు. మేం ఆ కష్టం పడ్డాం. ప్రతి షోకి అన్ని చోట్ల కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మౌత్ పబ్లిసిటీ చాలా పవర్ ఫుల్. 'శంకరాభరణం' నుంచి ఇప్పటి వరకు క్లాసిక్ సినిమాలు మౌత్ టాక్ వల్ల పెరిగాయి. యూత్ కు విపరీతంగా నచ్చింది. మార్నింగ్ షో చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేశారు.

సినిమా అద్భుతంగా ఉందన్నారు. మేం హ్యాపీగా ఉన్నాం. అయితే ఒక చిన్న వెలితి. ఈ రోజు మన సినిమా ఇండస్ట్రీ పెద్ద సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యిందనేది చాలా మంది ఉద్దేశం. అది ఎవరూ బయటపడరు. ఎందుకంటే... పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ పాన్ ఇండియా హీరోలతో సినిమాలు చేశారు. ఇప్పుడు దాసరి నారాయణరావు గారిలా.. కె బాలచందర్ గారిలా చిన్న సినిమాలు.. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తే? ఈ రోజు 'హ్యాపీ డేస్' లాంటి సినిమాలు వస్తే? ఏంటని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇండస్ట్రీ తాలూకా పోకడ మారింది. ఎందుకు మారిందంటే... ఈ రోజు ఫోనులో ప్రతిదీ అందుబాటులో ఉంది. చాలా ఓటీటీ వేదికలు వచ్చాయి. ఈ పోటీలో కరోనా ఒకటి. నేను పెద్ద పెద్ద సినిమాలు తీశాను. లో బడ్జెట్ సినిమాలు తీశాను. అప్పుడు టికెట్ ధర ప్రేక్షకులకు అందుబాటులో ఉండేది. ఇప్పుడు పెద్ద సినిమాలకు టికెట్ రేటు పెంచుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అంతా హ్యాపీ. నా రిక్వెస్ట్ ఏంటంటే... పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకోండి. చిన్న సినిమాలకు నాలుగు కోట్ల బడ్జెట్ లోపు సినిమాలకు రేట్లు తగ్గించండి. నేను ఒక థియేటర్ కు వెళితే... టికెట్ రేటు 200 పెట్టారు. చిన్న సినిమాకు అంత డబ్బులు పెట్టి నేను ఎందుకు చూస్తాను? మా సినిమాకు టాక్ బావుంది.

జనాలు వస్తున్నారు. ఏవరేజ్ ఫిల్మ్ అయితే ఓటీటీలో వస్తే చూద్దామని అనుకుంటున్నారు. ప్రయోగాత్మక సినిమాలు చూడటానికి టికెట్ రేటు ఎంత తగ్గిస్తారు? 30 శాతమా? 40 శాతమా? నేను చిన్న సినిమా తీశానని లేదంటే నా సినిమా కోసమో అడగటం లేదు. గతంలో దాసరి గారు,.. ఆ తర్వాత భరద్వాజ్ గారు,... నారాయణమూర్తి గారు అడిగారు. ఇవాళ నేను అడుగుతున్నాను. నా సినిమా కోసం అయితే విడుదలకు ముందు చెప్పేవాడిని. చిన్న సినిమా కోసం ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదంటే ఇదొక పెద్ద సినిమాల ఇండస్ట్రీగా ఉంటుంది తప్ప చిన్న సినిమాల ఇండస్ట్రీగా ఉండదు.

చిన్న చిన్న సినిమాలు తీయాలనుకునే ఔత్సాహిక దర్శకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ 'నేను ఓటీటీకి వెళ్లాలా? థియేటర్లకు రాలేనా?' అని ఎందుకు అనుకోవాలి. నాకు అర్థం కావడం లేదు... థియేటర్లలో పెద్ద పెద్ద సినిమాలే విడుదల చేయాలా? దీనికి పరిష్కారం ఏమిటి? ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. పెద్ద సినిమాలకు ఎంత రేట్ అయినా పెట్టుకోండి. క్రేజ్ ఉంది కాబట్టి థియేటర్లకు జనాలు వస్తారు. చిన్న సినిమాకు ఏదైనా చేయండి. లేదంటే చిన్న సినిమా రాదు'' అని అన్నారు.

ఎం.ఎస్.రాజు కోరిన‌ట్టు ప‌రిశ్ర‌మ మారుతుందా? చిన్న సినిమాల‌కు టికెట్ ధ‌ర త‌గ్గింపు వెసులుబాటు ఉంటుందా? అంటే దానికి నిర్మాత‌ల గిల్డ్ స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. రాజు గారు ఆకాంక్షించిన‌ట్టు.. ఇండ‌స్ట్రీ కేవ‌లం పెద్ద నిర్మాత‌ల‌కే కాదు.. అందరికీ చెందుతుంద‌ని ఎవ‌రు ఆలోచిస్తారో కూడా చూడాలి.