'వీరమల్లు' కోసం మళ్లీ రంగంలోకి దిగుతున్న పవన్!

Thu Oct 21 2021 13:58:14 GMT+0530 (India Standard Time)

hari hara veera mallu shooting update

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్ 'హరి హర వీరమల్లు'  సినిమాను రూపొందిస్తున్నాడు. ఇది మొగల్ చక్రవర్తుల పాలనా కాలానికి సంబంధించిన కథ. ఆ కాలంలో పేరు మోసిన ఒక వజ్రాల దొంగ కథ. సంపన్నులను దోచి పేదవాడికి పంచే రాబిన్ హుడ్ తరహా కథ. అలాంటి ఈ పాత్రను ఈ సినిమాలో పవన్ పోషిస్తున్నాడు. ఫస్టు లుక్ తోనే ఆయన మంచి మార్కులు కొట్టేశాడు. మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథ కావడంతో అప్పటి కట్టడాలకు సంబంధించిన భారీ సెట్లను వేశారు. ఇందుకోసం నిర్మాత ఎ.ఎమ్. రత్నమ్ కోట్ల రూపాయలను ఖర్చు చేశారు.ఈ సినిమా 50 శాతం వరకూ షూటింగు జరిగిన తరువాత కరోనా తీవ్రత కారణంగా షూటింగు ఆపుకోవలసి వచ్చింది. ఆ సమయంలో పవన్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఆ తరువాత నుంచి పవన్ 'భీమ్లా నాయక్' షూటింగు పైనే పూర్తి దృష్టిపెట్టాడు. 'వీరమల్లు'తో పోలిస్తే ఇది చిన్న సినిమానే గనుక ఈ సినిమాను పూర్తి చేసిన తరువాతనే వెళదామని పవన్ అనుకున్నాడు. అలా ఆయన చిత్రీకరణ పరంగా ఈ సినిమాను చివరిదశకు తీసుకొచ్చాడు. ఇక ఈ నెల 25వ తేదీ నుంచి 'వీరమల్లు' తాజా షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.

ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. అర్జున్ రామ్ పాల్ .. జాక్విలెన్ ఫెర్నాండేజ్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారని అంటున్నారు. డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని చెబుతున్నారు. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలుస్తుందనీ ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరోస్థాయిలో నిలబెడుతుందనే నమ్మకాన్ని క్రిష్ వ్యక్తం చేయడం అందరిలో మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఇక ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా నిధి అగర్వాల్ అలరించనుంది. ఈ సినిమాలో ఆమె మరింత గ్లామరస్ గా కనిపించనుందని అంటున్నారు. ఆ మధ్య ఆమె పుట్టినరోజున వదిలిన పోస్టర్ కుర్రాళ్ల మనసులను కట్టిపడేసింది. ఇంతవరకూ నిధి అగర్వాల్ చేస్తూ వచ్చిన సినిమాల్లో అత్యధిక బడ్జెతో నిర్మితమవుతున్న సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమాపై ఈ సుందరి భారీ ఆశలే పెట్టుకుంది. వచ్చే ఏడాదిలో ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఏ స్థాయి సంచలనానికి తెరతీస్తుందనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.