చిరు ఛాన్సిచ్చాడు.. బాబి అదరగొట్టాడు!

Tue Jan 24 2023 13:00:01 GMT+0530 (India Standard Time)

chiranjeevi and director bobby waltair veerayya movie

ఏ స్టార్ ని ఎలా చూపించాలో.. తనకు ఎలాంటి కథ సూటవుతుందో ఆ నాడిని కరెక్ట్ గా పట్టినప్పుడే ఏ డైరెక్టర్ అయినా సక్సెస్ ని సొంతం చేసుకుంటాడు. హీరో ఇచ్చిన ఛాన్స్ సక్రమంఆ సద్వినియోగం చేసుకుంటాడు. అలా కాకుండా క్యారెక్టర్ ని మాత్రమే కొత్తగా డిజైన్ చేసిన కథ విషయంలో నేలవిడిచి సాము చేస్తే అది మొదటికే మోసం అవుతుంది. ఇచ్చిన అవకాశం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి విషయంలోనూ ఇదే జరిగింది. చిరుని పక్కా మాసీవ్ క్యారెక్ట్ లో చూపిస్తూ చేసిన సినిమాలు కొన్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.చిరు మాస్ లుక్ డ్యాన్సింగ్ మూవ్ మెంట్స్ డిఫరెంట్ మేకోవర్ తో అదరగొట్టినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఇందుకు జస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచిన సినిమాలు ముఠామేస్త్రీ అందరివాడు. చిరుని చాలా ఏళ్ల తరువాత పక్కా మాసీవ్ క్యారెక్టర్ లో ఏ.కోదండరామిరెడ్డి రూపొందించిన ముఠామేస్త్రీ క్యారెక్టర్ పేలినా సినిమా అంతగా పేలని విషయం తెలిసిందే. ఆ తరువాత అదే తరహా మేకోవర్ ని నమ్ముకుని శ్రీను వైట్ల చేసిన మూవీ `అందరివాడు`.

ఈ మూవీలోని గోవిందు క్యారెక్టర్ లో చిరు చించేశాడు. మేకోవర్ డైలాగ్ డెలివరీ మ్యానెరిజమ్స్ .. సాంగ్స్ తో ఓ రేంజ్ లో రచ్చ చేశాడు. క్యారెక్టర్ హిట్ అయిందే కానీ చిరు ఊహించిన సక్సెస్ మాత్రం దక్కలేదు. దీంతో `అందరి వాడు` కాస్తా కొందరి వాడుగానే మిగిలిపోయాడు. మళ్లీ ఇన్నాళ్లుకు ఆయా సినిమాల్లోని వింటేజ్ చిరుని గుర్తు చేస్తూ దర్శకుడు బాబి చేసిన మూవీ `వాల్తేరు వీరయ్య`. ఇందులో చిరు క్యారెక్టర్ ని డిజైన్ చేసిన తీరు `ముఠా మేస్త్రీ` అందరివాడు సినిమాలని గుర్తు చేసేలా వుంది.    

అయితే ఆ రెండు సినిమాల్లో మిస్సయిన అంశాలని మరింత బలంగా జోడించి దర్శకుడు బాబి `వాల్తేరు వీరయ్య`ని రూపొందించడంతో సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ సంక్రాంతి విజేతగా జేజేలు అందుకుంటోంది. వింటేజ్ చిరుని తెరపై అంతే పర్ ఫెక్ట్ గా ఆవిష్కరించి శ్రీను వైట్ల చేయలేని ఫీట్ ని కరెక్ట్ గా ప్రజెంట్ చేసి చిరు ఛాన్స్ కి పర్ ఫెక్ట్ న్యాయం చేసి అదరగొట్టేశాడని చెప్పక తప్పదు. ఆచార్య డిజాస్టర్ గాడ్ ఫాదర్ సోసో కలెక్షన్ లతో విసిగిపోయిన ఫ్యాన్స్ కి అన్నట్టుగానే బాబి పూనకాలు తెప్పించాడు.

విడుదలైన పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా `వాల్తేరు వీరయ్య` 200 కోట్ల మార్కుకి చేరుకోవడాన్ని బట్టి ఈ మూవీతో చిరుకి బాక్సాఫీస్ వద్ద బాబి ఏ స్థాయిలో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడో అర్థమవుతోందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో `వాల్తేరు వీరయ్య` వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. శ్రీను వైట్ల ఎంచుకున్న గోవిందు పాత్రని ఫాలో అవుతూ ఆ పాత్రకు తనదైన శైలిని ఆపదించి చిరు వీరయ్య పాత్రని మలిచిన తీరు కథ కథనాలని నడిపించిన తీరే ఇప్పడు `వాల్తేరు వీరయ్య`కు కాసులు వర్షం కురిపిస్తూ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తుండటం గమనార్హం. ఫైనల్ గా అభిమానిగా చిరుని ఎలా చూడాలనుకున్నాడో బాబి అలాగే వెండితెరపై ఆవిష్కరించి తనకు చిరు ఇచ్చిన ఛాన్స్ ని నూటికి నూరుపాళ్లు సద్వినియోగం చేసుకుని బాబి అదరగొట్టేశాడని చెప్పక తప్పదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.