రీ రిలీజ్ లపై పడ్డ బెల్లంకొండ... ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

Mon Sep 26 2022 20:18:25 GMT+0530 (India Standard Time)

bellamkonda suresh on aadi movie re release

టాలీవుడ్ లో రీ రిలీజ్ జోరు కంటిన్యూ అవుతోంది. మహేష్ బాబు పోరికి రీ రిలీజ్ అయినప్పటి నుండి ఈ జోరు మరింత పెరిగింది. చిరంజీవి... పవన్ కళ్యాణ్ ఇలా స్టార్ హీరోల పుట్టిన రోజులు వచ్చిన సందర్భంగా వారి యొక్క సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి కొత్త పద్దతికి బెల్లంకొండ సురేష్ తెర తీశాడు.చెన్నకేశవరెడ్డి సినిమా విడుదల అయ్యి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ మరియు ఆస్ట్రేలియాలో కూడా భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు. సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. బాలయ్య అభిమానులు అరుదైన రికార్డును నమోదు చేశారు. ఇప్పడు నిర్మాత బెల్లంకొండ సురేష్ మరో రీ రిలీజ్ గురించి ప్రకటించి అందరిని ఆశ్చర్యపర్చాడు.

ఇప్పటి వరకు హీరోల యొక్క పుట్టిన రోజులకు లేదంటే సినిమా విడుదల అయిన రోజుల ప్రత్యేక రోజుల సందర్భంగా సినిమాలను విడుదల చేయడం జరిగింది. కానీ బెల్లంకొండ సురేష్ త్వరలో ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాను ఎలాంటి ప్రత్యేక సందర్భం లేకుండానే విడుదల చేయబోతున్నాడు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించాడు.

నవంబర్ లో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటైన ఆది ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఆది 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేవలం ఫ్యాన్స్ కోసం కొన్ని షో లు వేయడం జరిగింది. కానీ ఆది సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ప్లాన్ చేస్తున్నట్లుగా నిర్మాత పేర్కొన్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నాడు.

వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఆది సినిమా లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సన్నివేశాలు ఇప్పటికి కూడా అభిమానులకు రోమాలు నిక్కపొడిచేలా చేస్తాయి అనడంలో సందేహం లేదు. అంతే కాకుండా అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా డైలాగ్ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో తెల్సిందే.

ఇప్పటికి కూడా ఆ డైలాగ్ ని వాడేవాళ్లు ఉన్నారు. అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న ఆది సినిమా ని థియేటర్ లో రీ రిలీజ్ చేస్తే తప్పకుండా కలెక్షన్స్ విషయంలో కుమ్మేయడం ఖాయం అని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమకు వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకుని రీ రిలీజ్ లో సరికొత్త రికార్డులను నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.