ముగ్గురి కలయికలో మరో 'సరైనోడు'

Mon Sep 13 2021 19:04:31 GMT+0530 (IST)

allu arjun boyapati Movie Update

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన మూవీ 'సరైనోడు'. బన్నీ కెరీర్ లో అప్పటి వరకు విడుదల అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ యాక్షన్ డ్రామాగా ఆ సినిమా నిలిచింది. బన్నీకి సరైనోడు ఒక సరైన సినిమా అంటూ అంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. మొదటి నుండి కూడా సరైనోడు తరహాలో మరో యాక్షన్ బ్లాక్ బస్టర్ ను బోయపాటి మరియు బన్నీల కాంబోలో నిర్మించేందుకు అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అన్నట్లుగానే వచ్చే ఏడాదిలో అల్లు అర్జున్ మరియు బోయపాటి ల కాంబోలో సినిమాను నిర్మించేందుకు గాను అల్లు అరవింద్ రెడీ అవుతున్నారని.. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బోయపాటి అఖండ సినిమా షూట్ లో ఉన్నాడు. బాలయ్య హీరోగా నటిస్తున్న అఖండ సినిమాను వచ్చే నెలలో దసరా కానుకగా విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి.



అఖండ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని.. తద్వార మళ్లీ బోయపాటి క్రేజ్ అమాంతం పెరగడం ఖాయం అనే నమ్మకంతో అంతా ఉన్నారు. అదే ఉద్దేశ్యంతో అల్లు అరవింద్ కూడా ఉన్నారని అందుకే బన్నీ తో ఆయన సినిమా ను ఇప్పటికే కన్ఫర్మ్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప పార్ట్ 2 తర్వాత వీరి కాంబో మూవీ ఉంటుందని అంటున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప  పార్ట్ 1 ను ముగించే పనిలో ఉన్నాడు. వచ్చే నెలలో పుష్ప 1 కు గుమ్మడి కాయ కొట్టి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమాకు కొబ్బరికాయ కొట్టాలని భావిస్తున్నారట. ఐకాన్ విషయంలో కాస్త ఊగిసలాట కనిపిస్తుతంది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అనేది కనిపించడం లేదు. ఈ సమయంలో సరైనోడు కాంబో గురించిన విశ్వసనీయ సమాచారం అందుతోంది.

సరైనోడు కలయికలో సినిమా అవ్వడం వల్ల ఖచ్చితంగా క్రేజ్ మరో రేంజ్ అన్నట్లుగా ఉంటుంది. బోయపాటి ఆ రేంజ్ ను అందుకోవాలంటే స్క్రిప్ట్ విషయంలో కాస్త ఎక్కువ సమయం తీసుకోవాల్సి ఉంటుంది. పుష్ప సినిమా రెండు పార్ట్ లు పూర్తి అయ్యి విడుదల అవ్వడానికి ఖచ్చితంగా చాలా సమయం పడుతుంది. కనుక ఆ సమయంలో బోయపాటి పూర్తిగా తన దృష్టిని బన్నీ మూవీ స్క్రిప్ట్ పై పెట్టవచ్చు. మెగా కాంపౌండ్ రచయితలతో కలిసి బన్నీ స్టైల్ కు తగ్గట్లుగా మరో సరైనోడు స్క్రిప్ట్ ను రెడీ చేయడం జరుగుతుందని మెగా కాంపౌండ్ వర్గాల వారు అనధికారికంగా చెబుతున్నారు. అఖండ సినిమా లో బాలయ్య ను చాలా విభిన్నంగా వినూత్నంగా కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు పెరిగాయి. బోయపాటి గత సినిమా వినయ విధేయ రామ తాలూకు జ్ఞాపకాలను అఖండ చెరిపి వేస్తుందనే అంతా నమ్మకంతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.