22 ఏళ్ల తరువాత తెరపైకి అజిత్ - టబు జోడీ!

Sat Jan 29 2022 19:00:01 GMT+0530 (IST)

ajith tabu Movie Update

కోలీవుడ్లో అజిత్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను .. మాస్ ఆడియన్స్ లోను ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళనాట అజిత్ తరువాత తెరపైకి వచ్చిన అందగాడు లేడు. కెరియర్ ఆరంభంలో అమ్మాయిల్లో ఆయనకున్న క్రేజ్ అప్పటి స్టార్ హీరోలను సైతం కంగారు పెట్టేసిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక అప్పటికే స్టార్ హీరోయిన్స్ అనిపించుకున్నవారు సైతం ఆయనతో కలిసి నటించడానికి పోటీపడ్డారు. ఇప్పటికీ అదే పరిస్థితి ఉండటం విశేషం.సాధారణంగా మంచి రంగు ఉండి .. హ్యాండ్సమ్ గా .. స్టైల్ గా .. డీసెంట్ గా కనిపించే వారు మాస్ ఇమేజ్ తెచ్చుకోవడం చాలా కష్టం. అందునా తమిళ ప్రేక్షకులు విపరీతమైన మాస్ అంశాలను కోరుకుంటారు. అలాంటి మాస్ ప్రేక్షకులను సైతం మెప్పిస్తూ ఆ వైపు నుంచి అభిమానులను పెంచుకుంటూ వెళ్లడం అజిత్ కి మాత్రమే చెల్లింది. ఒక సికింద్రాబాద్ కుర్రాడు తమిళనాడు వెళ్లి .. అక్కడ నెంబర్ వన్ హీరోగా చక్రం తిప్పడం అంటే అది అంత మాషా మాషీ విషయమేం కాదు. ఇప్పటికీ కూడా అజిత్ అదే ఉత్సాహంతో వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు.

కొంతకాలంగా ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. త్వరలో ఆయన నుంచి 'వలిమై' ప్రేక్షకుల ముందుకు రానుంది. హెచ్.వినోత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు .. హిందీ భాషల్లోను ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.  అజిత్ తనకి ఒక హిట్ ఇచ్చిన దర్శక నిర్మాతలతో వరుస సినిమాలు చేస్తుంటాడు. అజిత్ సింప్లిసిటీ కారణంగా ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు చాలా కంఫర్టబుల్ గా ఫీలవుతారు. అందువలన ఆ టీమ్ నుంచి వరుస సినిమాలు వస్తుంటాయి.

ఇప్పుడు కూడా వినోత్ - బోనీ కపూర్ కాంబినేషన్లో మరో సినిమా చేయాలని అజిత్ నిర్ణయించుకున్నాడు. అందుకు సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. యాక్షన్ డ్రామా జోనర్లో ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా 'టబు'ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 2000వ సంవత్సరంలో రాజీవ్ మీనన్ దర్శకత్వంలో అజిత్- టబు కాంబినేషన్లో ఒక సినిమా వచ్చింది. తమిళంలో హిట్ కొట్టిన ఆ సినిమా తెలుగులో 'ప్రియురాలు పిలిచింది' టైటిల్ తో విడుదలైంది. మళ్లీ ఇంతకాలానికి .. అంటే 22 ఏళ్ల తరువాత ఈ జోడీని తెరపై చూడనుండటం అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే.