Begin typing your search above and press return to search.

చంటి' కోసం రాజేంద్రప్రసాద్ ను అనుకున్నారట!

By:  Tupaki Desk   |   24 Jan 2022 8:34 AM GMT
చంటి కోసం రాజేంద్రప్రసాద్ ను అనుకున్నారట!
X
తెలుగులోని స్టార్ ప్రొడ్యూసర్స్ లో కేఎస్ రామారావు ఒకరు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ ద్వారా ఆయన చాలా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ సినిమాల్లో భారీ విజయాలను అందుకున్నవే ఎక్కువ. ఆయన బ్యానర్లో వచ్చిన చెప్పుకోదగిన సినిమాల్లో 'చంటి' ఒకటి.

వెంకటేశ్ కెరియర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిన 'చంటి' 1992' జనవరి 10వ తేదీన విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా 30 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా కేఎస్ రామారావు ఈ సినిమాను గురించిన విశేషాలను గుర్తుచేసుకున్నారు.

"తమిళంలో ప్రభు హీరోగా దర్శకుడు పి.వాసు చేసిన 'చిన్నతంబి' విజయాన్ని సాధించింది. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని నేను .. రవిరాజా పినిశెట్టి అనుకున్నాము. రాజేంద్రప్రసాద్ తో పాటు మరికొందరి పేర్లను పరిశీలించాము.

ఆ సమయంలో సురేశ్ బాబు గారు .. ఈ సినిమాను వెంకటేశ్ తో చేస్తే ఎలా ఉంటుందని అడిగారు. ఆయన డేట్స్ ఇస్తే చేయడానికి నేను రెడీ అని చెప్పాను. ఆ తరువాత నుంచి అన్ని పనులు చకచకా జరిగిపోయాయి. 'చంటి' పాత్ర కోసం వెంకటేశ్ చాలా కసరత్తు చేశారు.

నిజానికి అప్పటివరకూ వెంకటేశ్ గారికి మాస్ ఇమేజ్ ఎక్కువగా ఉండేది. పెర్ఫార్మెన్స్ పరంగా ఈ సినిమా ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇక మీనా కూడా చాలా బాగా చేసింది. ఈ సినిమా తరువాత ఆమె ఎంత స్టార్ అయిందనేది అందరికీ తెలిసిందే.

ఈ సినిమా కోనసీమ నేపథ్యంలో జరుగుతున్నట్టుగా చూపించినా, అక్కడ మేము షూటింగు చేసింది చాలా తక్కువ. తిరుపతి పరిసర ప్రాంతాల్లో షూటింగు ఎక్కువ చేశాము. హైదరాబాద్ లోను ఒక పాటను తీశాము. కానీ ప్రేక్షకులకు ఎంతమాత్రం అనుమానం రాకుండా చేయగలగడం రవిరాజా గొప్పతనమనే చెప్పాలి.

బలమైన కథాకథనాలను మన నేటివిటీకి దగ్గరగా తీసుకు వెళ్లడం .. రవిరాజా టేకింగ్ .. వెంకటేశ్ హార్డు వర్క్ .. మీనా గ్లామర్ .. ఇళయరాజా పాటలు ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించడానికి కారణంగా చెప్పుకోవచ్చు. తమిళంలో ఉన్న పాటలనే వేటూరితో తెలుగులో రాయించాము. పాటలన్నీ కూడా అద్భుతంగా వచ్చాయి.

తమిళంలో వచ్చిన 'చిన్న తంబి' కంటే తెలుగులో ఈ సినిమా పెద్ద హిట్ కావడం విశేషం. ఇప్పటికీ ఈ సినిమాను గురించి మాట్లాడుకుంటున్నామంటే అది ఆ సినిమా గొప్పతనమే అనుకోవాలి" అని చెప్పుకొచ్చారు.