Begin typing your search above and press return to search.

ఒక‌సారి క‌మిట‌య్యార‌ని రాజ‌మౌళినే వ‌దులుకుంటారా?

By:  Tupaki Desk   |   18 April 2021 2:30 PM GMT
ఒక‌సారి క‌మిట‌య్యార‌ని రాజ‌మౌళినే వ‌దులుకుంటారా?
X
ఒక‌సారి కమిటైతే నా మాట నేనే విన‌ను! .. ఇది మ‌హేష్ ప‌లికిన పంచ్ డైలాగ్. ఆ డైలాగ్ ని నిజ‌జీవితంలోనూ ఆయ‌న అనుస‌రిస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఒక దర్శ‌కుడికి క‌మిట్ మెంట్ ఇస్తే అత‌డిని మ‌హేష్ సినిమా చేసే వ‌ర‌కూ వ‌దిలిపెట్ట‌రు. క‌థ‌- స్క్రిప్టుతో మెప్పించ‌లేక‌పోతే ఏమీ చేయ‌లేరు కానీ.. ఆ ద‌ర్శ‌కుడితో ఏదో ఒక రోజు త‌ప్ప‌నిస‌రి. అప్ప‌టివ‌ర‌కూ త‌న స్నేహితుల జాబితాలో చేరి వెయిట్ చేస్తారు!

అయితే అలా ఆయ‌న క‌మిటైన ప‌లువురు ద‌ర్శ‌కులు మ‌హేష్ పాన్ ఇండియా ప్లాన్స్ కి బ్రేక్ వేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. మ‌హేష్ ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ తో స‌ర్కార్ వారి పాట సినిమా చేస్తున్నారు. దీని త‌రవాత త్రివిక్ర‌మ్- అనీల్ రావిపూడి- వంశీ పైడిప‌ల్లి క్యూలో ఉన్నారు. వీళ్ల‌తో పాటు ప‌లువురు సీనియ‌ర్ డైరెక్ట‌ర్లు కూడా స్క్రిప్టులు ప‌ట్టుకుని ఆయ‌న చుట్టూ తిరిగేస్తున్నార‌ట‌. పూరి- కొర‌టాల కూడా క్యూలోనే ఉన్నారు.

అయితే వీళ్లంద‌రి కంటే ముందే పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ఎస్.ఎస్.రాజ‌మౌళితో మహేష్ సెట్స్ కెళ‌తారా వెళ్ల‌రా? చాలా కాలంగా పెండింగులో ఉన్న ఈ ప్రాజెక్టును ముందుకు న‌డిపిస్తారా లేదా? అన్న‌దే స‌స్పెన్స్ గా మారింది. త్రివిక్ర‌మ్ వ‌ర‌కూ వ‌దిలేస్తే ఆ త‌ర్వాత అయినా రాజ‌మౌళితో మ‌హేష్‌ సినిమా ఉందా లేదా? అంటే క్లారిటీ లేకుండా ఉంది.

ప్ర‌స్తుతం అన్నిచోట్లా పాన్ ఇండియా వేవ్ న‌డుస్తోంది. స్టార్ హీరోలంతా రాజ‌మౌళి - శంక‌ర్ అంటూ పాన్ ఇండియా డైరెక్ట‌ర్ల వెంటే ప‌డుతుంటే మ‌హేష్ ద‌ర్శ‌క‌ధీరుడి సినిమాని వాయిదా వేయ‌డం ఏమిటీ? అంటూ అభిమానులు విసిగివేసారి పోతున్నారు. క‌నీసం ఇప్ప‌టికి అయినా రాజ‌మౌళితో లాక్ అయితే అత‌డి స్థాయి అమాంతం మారిపోతుంద‌ని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. కానీ మహేష్ మైండ్ లోనే ఏం ఉందో అర్థం కావ‌డం లేదు.

ఓవైపు ఆర్.ఆర్.ఆర్ తో చ‌ర‌ణ్‌.. తార‌క్ కూడా పాన్ ఇండియా మార్కెట్లో నిరూపించుకుని పెద్ద సినిమాల లైన‌ప్ ని ప్లాన్ చేస్కుంటే మ‌హేష్ ఏంటి ఇలా ఆలోచిస్తున్నారు? ఒక‌వైపు కొండ‌లా ఎదిగేసిన డార్లింగ్ ప్ర‌భాస్ తో అంద‌రూ పోటీప‌డుతుంటే మ‌హేష్ మాత్రం త‌న ద‌ర్శ‌కుల‌కు ఇచ్చిన క‌మిట్ మెంట్ కోసం వెన‌క‌బ‌డ‌తారా? అన్న చ‌ర్చా వేడెక్కిస్తోంది. స‌వాల‌క్ష చిక్కుల‌తో కూడుకున్న‌ య‌క్ష ప్ర‌శ్న‌ల‌కు మ‌హేష్ నుంచి స‌మాధానం రాదేమీ?