Begin typing your search above and press return to search.

మన లేడీ సూపర్‌ స్టార్‌ అక్కడ సత్తా చాటేనా?

By:  Tupaki Desk   |   23 July 2021 7:30 AM GMT
మన లేడీ సూపర్‌ స్టార్‌ అక్కడ సత్తా చాటేనా?
X
సౌత్ లో ఉత్తరాది ముద్దుగుమ్మలకు విపరీతమైన డిమాండ్ ఉంది. కాని సౌత్‌ హీరోయిన్స్ కొద్ది మంది మాత్రమే నార్త్‌ లో స్టార్స్ గా పేరు దక్కించుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు మరియు తమిళంలో స్టార్‌ హీరోయిన్స్ గా పేరు దక్కించుకున్న వారు బాలీవుడ్‌ లో ఎక్కువగా ప్రభావం చూపించిన దాఖలాలు లేవు. ఒకరు ఇద్దరు బాలీవుడ్ లో సినిమాలు చేసినా కూడా వారు స్టార్‌ లుగా మాత్రం గుర్తింపు దక్కించుకోలేక పోతున్నారు. ఇప్పుడు సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార హీరోయిన్‌ గా హిందీలో సినిమా చేసేందుకు సిద్దం అయ్యింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉందంటున్నారు. తమిళ మీడియా ఈ విషయమై గత కొన్ని రోజులుగా తెగ హడావుడి చేస్తోంది.

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ హీరోగా అట్లీ కుమార్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో నయనతార హీరోయిన్‌ గా దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యిందని తమిళ మీడియా కోడై కూస్తోంది. ఇన్నాళ్లు బాలీవుడ్‌ నుండి నయనతారకు ఎన్నో ఆఫర్లు వచ్చినా కూడా ఆమె మాత్రం సౌత్‌ సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని.. ఇప్పుడు అభిమాన దర్శకుడు అట్లీ కుమార్‌ దర్శకత్వం లో బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ హీరోగా సినిమా అవ్వడం వల్ల బాలీవుడ్ ఎంట్రీకి ఓకే చెప్పిందని తమిళ మీడియా కథనాలు రాస్తోంది. తమిళంలో వరుసగా లేడీ ఓరియంటెడ్‌ సినిమా లు చేస్తూ స్టార్‌ గా నిలిచి పారితోషికం విషయంలో హీరోలకు పోటీ అన్నట్లుగా నిలిచిన నయనతార టాలీవుడ్ లో కూడా మంచి పేరు దక్కించుకుంది.

సీనియర్‌ హీరోలకు ఈమె మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా మారింది. ఇప్పటికి కూడా ఈమెకు తెలుగు మరియు తమిళం నుండి వరుస ఆఫర్లు వస్తున్నాయి. కాని ఆచి తూచి సినిమా లు చేస్తున్న నయనతార ఇప్పుడు బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. షారుఖ్‌ ఖాన్‌ వల్ల బాలీవుడ్‌ లో నయనతారకు మంచి ఎంట్రీ లభించడం ఖాయం. ఆ సినిమా సక్సెస్ అయ్యి నయనతార పాత్రకు ఆమె నటనకు మంచి పేరు వస్తే మాత్రం ఇక బాలీవుడ్ లో నయన్‌ బిజీ అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేడీ సూపర్‌ స్టార్ గా సౌత్‌ లో మంచి పేరు దక్కించుకున్న నయన్‌ ఒక వేళ అక్కడ విఫలం అయితే మాత్రం నెటిజన్స్ అక్కడ ఓ రేంజ్‌ లో ట్రోల్‌ చేయడం ఖాయం అంటున్నారు.

లేడీ సూపర్‌ స్టార్‌ అంటూ ఈమెను అంతగా ఎత్తేసే జనాలను కూడా ఉత్తరాది సినీ జనాలు మరియు ప్రేక్షకులు నెటిజన్స్‌ కామెంట్స్‌ చేసే అవకాశం ఉంటుంది. అందుకే హిందీ సినిమా లో నయనతార సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో నయన్‌ కనుక సక్సెస్‌ దక్కించుకుంటే అక్కడ కూడా లేడీ సూపర్‌ స్టార్‌ ట్యాగ్‌ ను కంటిన్యూ చేసుకోవచ్చు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. లేడీ సూపర్‌ స్టార్‌ గా ప్రస్తుతం నయనతార తమిళం మరియు తెలుగు ప్రేక్షకుల చేత పిలిపించుకుంటుంది.. మరి ముందు ముందు ఉత్తరాది ప్రేక్షకులతో కూడా లేడీ సూపర్‌ స్టార్‌ అనిపించుకుంటుందా అనేది చూడాలి.