విజిల్: తెలుగువారికి నచ్చుతుందా?

Tue Oct 22 2019 19:00:01 GMT+0530 (IST)

Whistle movie in Telugu Film Industry

ఈమధ్య తమిళ సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా తెలుగులో హిట్ కాలేదు.  సూపర్ హిట్ అనిపించుకున్న చివరి తమిళ డబ్బింగ్ సినిమా ఏదని ప్రశ్నిస్తే ఎలాంటి సినీప్రేమికుడైనా బదులివ్వలేక తెల్లమొహం వెయ్యాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దీపావళికి రెండు డబ్బింగ్ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి.  తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'బిగిల్'.. కార్తి నటించిన 'ఖైది' ఆ రెండు సినిమాలు.కార్తి సినిమాలు తెలుగులో వరసబెట్టి ఫ్లాపులు అవుతున్నాయి. ఈ 'ఖైది' కూడా అద్భుతం అంటే తప్ప హిట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక విజయ్ 'బిగిల్' డబ్బింగ్ వెర్షన్ 'విజిల్' విషయానికి వస్తే ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే అనిపించినా కొన్ని ఫ్యాక్టర్స్ మాత్రం విజయానికి అడ్డంకిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులో ఒకటి విజయ్ హీరోయిజం. విజయ్ తమిళనాట పెద్ద స్టార్ కాబట్టి ఆయన మేనరిజం.. ఆ స్టైల్ చూసి తమిళ ప్రేక్షకులు వెర్రెత్తిపోతారు. తెలుగు ప్రేక్షకులకు అది ఎంతమాత్రం కనెక్ట్ అవుతుందనేది అనుమానమే.  మరో విషయం ఏంటంటే ఈ సినిమా ఫుట్ బాల్ గేమ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.  తమిళనాట ఫుట్ బాల్ కు ఆదరణ ఎక్కువ.  అదే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి 'సాకర్' అనే పేరు కూడా తెలీదు.  అలా ఉంటుంది రియాలిటీ. గేమ్ రూల్స్ చెప్పమంటే పదిమందిలో తొమ్మిది మంది చెప్పలేరు.  ఈ ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ మనకు కనెక్ట్ అయ్యే విషయం కాదు.

వీటికి తోడు వయసుమళ్ళిన రాయప్ప గెటప్.. ఆ మాసు నేపథ్యం అంతా తమిళ నేటివిటీతో నిండి ఉంది. కొంతవరకూ తమిళ నేటివిటీ అంటే మన ప్రేక్షకులు భరించగలరేమో కానీ పూర్తిగా తమిళ నేటివిటీ అంటే పిచ్చెక్కడం ఖాయం.  ఇవన్నీ చూస్తుంటే 'విజిల్' కు తెలుగులో విజయం అంత సులువుగా దక్కదేమోననే అంటున్నారు. మరి వీటిని దాటుకుని విజయం సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.