రాముడి పాత్రకు ఆ ఇద్దరిలో ఎవరు?

Mon Jan 24 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

Which of these two plays the role of Rama

అల్లు అరవింద్.. మధు మంతెన ఇంకా బాలీవుడ్ ప్రముఖులు కలిసి రామాయణం ప్రాజెక్ట్ ను చేపట్టబోతున్నట్లుగా ప్రకటించి ఏళ్లు గడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు ఇన్ని సంవత్సరాలు అవుతుంటే అసలు ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రకటించిన వారు ఈ ప్రాజెక్ట్ గురించి మర్చి పోయారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ.. రామాయణం ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చదా అంటూ నిటూర్చుతున్న ప్రతి సారి కూడా సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వచ్చి మళ్లీ వార్తల్లో నిలుస్తుంది. ఈ సినిమా లో నటీ నటుల ఎంపిక అనేది అత్యంద పెద్ద టాస్క్ గా మారింది. హృతిక్ రోషన్ అమీర్ ఖాన్ మొదలుకుని టాలీవుడ్ మరియు కోలీవుడ్ స్టార్స్ ను కూడా సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాని ఇప్పటి వరకు ఏ ఒక్క పాత్రకు ఏ ఒక్క నటుడిని కూడా ఓకే చేసినట్లుగా దాఖలాలు లేవు.రామాయణం అనగానే రాముడి పాత్ర ఎవరు చేస్తారు అనేది చర్చ. ఇప్పుడు రాముడి పాత్ర కోసం మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. పలువురు హీరోలను పరిశీలించిన తర్వాత మేకర్స్ చివరకు బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ మరియు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుల వద్దకు వచ్చి ఆగినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరితో కూడా ఈ ప్రాజెక్ట్ గురించి మేకర్స్ చర్చించారట. ఇద్దరి నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. వెయ్యి కోట్ల రామాణం అంటే ఖచ్చితంగా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్ట్ లో నటించాలని ప్రతి ఒక్క నటీ నటులకు కూడా ఉంటుంది. కనుక మహేష్ బాబు అయినా రణబీర్ కపూర్ అయినా ఈ సినిమా లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. మరి రాముడి పాత్రకు వీరిద్దరిలో ఎవరు ఓకే అవుతారు అనేది చూడాలి.

దంగల్ దర్శకుడు నితేష్ తివారి దర్శకత్వంలో ఈ భారీ ఇతిహాస చిత్రం పలు పార్ట్ లుగా తెరకెక్కబోతుందని అంటున్నారు. కరోనా వల్ల ఆలస్యం అయ్యింది కాని లేదంటే ఇప్పటి వరకు కనీసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయినా పూర్తి అయ్యి ఉంటుందని అంటున్నారు. 2025 వరకు కనీసం ఫస్ట్ పార్ట్ అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రామాయణం పై ఇప్పటికే ఎన్నో సినిమా లు వచ్చాయి. కాని ఈసారి రాబోతున్న సినిమా ఖచ్చితంగా అద్బుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఈతరం ప్రేక్షకులకు రామాయణం గురించి పూర్తిగా వివరించేదిలా ఉంటుందని నెటిజన్స్ మరియు సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాముడి పాత్ర విషయంలో ఒక క్లారిటీ వస్తే రావణాసురుడి పాత్ర విషయమై చర్చలు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన స్టార్స్ ను మరియు ఇంగ్లీష్ నటీ నటులను కూడా ఈ సినిమాలో నటింపజేసేలా ప్లాన్ చేస్తున్నారు. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా రూపొందబోతుందని అంటున్నారు.