Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'వేర్ ఈజ్ ఈ ద వెంకటలక్ష్మీ'

By:  Tupaki Desk   |   15 March 2019 9:05 AM GMT
మూవీ రివ్యూ : వేర్ ఈజ్ ఈ ద వెంకటలక్ష్మీ
X
చిత్రం : 'వేర్ ఈజ్ ఈ ద వెంకటలక్ష్మీ'

నటీనటులు: రాయ్ లక్ష్మీ - ప్రవీణ్ - మధునందన్ - రామ్ కార్తీక్ - పూజిత పొన్నాడ - అన్నపూర్ణ తదితరులు
సంగీతం: హరి గౌర
ఛాయాగ్రహణం: వెంకట్ శాఖమూరి
కథ - స్క్రీన్ ప్లే - మాటలు: తటవర్తి కిరణ్
నిర్మాతలు: శ్రీధర్ రెడ్డి - ఆనంద్ రెడ్డి-ఆర్కే రెడ్డి
దర్శకత్వం: వై.కిషోర్ కుమార్

రాయ్ లక్ష్మీ కథానాయికగా.. కమెడియన్లు ప్రవీణ్-మధునందన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’. కొత్త దర్శకుడు కిషోర్ కుమార్ రూపొందించిన ఈ హార్రర్ కామెడీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

చంటి (ప్రవీణ్) - పండు (మధునందన్) అనే ఇద్దరు యువకులు తమ గ్రామంలో ఉన్న వాళ్లందరికీ పెద్ద తలనొప్పిలా తయారవుతారు. వాళ్ల వల్ల ఆ ఊర్లో ఇబ్బంది పడని వాళ్లంటూ ఉండరు. అలాంటి ఊరికి వెంకటలక్ష్మీ అనే టీచర్ వస్తుంది. చంటి.. పండు ఆమె మాయలో పడతారు. వెంకటలక్ష్మీని ఇంప్రెస్ చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ చివరికి చూస్తే ఆమె మనిషి కాదు దయ్యం అని తెలుస్తుంది. చంటి-పండు ఆమె ఉచ్చులో పడతారు. తన నుంచి బయటపడాలంటే ఒక పని చేసి పెట్టాలని వెంకటలక్ష్మీ వాళ్లను బెదిరిస్తుంది. ఇంతకీ ఆమె చెప్పిన పనేంటి.. వీళ్లా పని చేసి వెంకటలక్ష్మీ నుంచి బయటపడ్డారా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

కొన్ని ఐడియాలు వినడానికి బాగుంటాయి. కానీ ఎగ్జైటింగ్‌ గా అనిపించే ఐడియాను రెండున్నర గంటల సినిమాగా మలచాలంటే ఎంతో పనితనం ఉండాలి. ఆ ఐడియాను బేస్ చేసుకుని బిగువైన కథాకథనాలు అల్లడం.. తెరపై ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడం అంత సులువైన విషయం కాదు. ఐడియాను మాత్రమే నమ్ముకుని చుట్టూ ఏది పడితే అది పేర్చేసి మొక్కుబడిగా వ్యవహారం లాగించేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ సినిమా ఉదాహరణగా నిలుస్తుంది. హార్రర్ కామెడీ సినిమాల్లో సాధారణంగా దయ్యం మనిషిలా నటించి.. ఆ తర్వాత తన అసలు రూపాన్ని చూపిస్తుంది. ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’లో దానికి భిన్నమైన పాయింట్ చూస్తాం. గతంలో కొన్ని సినిమాల్లో టచ్ చేసిన పాయింటే ఇది. కానీ ఇందులో దాన్ని కొంచెం పొడిగించే ఒక సినిమాగా మలిచారు. ఐతే ఇంట్రెస్టింగ్ ఐడియాను చాలా పేలవంగా ఎగ్జిక్యూట్ చేయడంతో ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ ఎందుకూ కొరగాకుండా పోయింది.

‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’లో మొదటగా దయ్యాన్ని చాలా భయానకంగా చూపిస్తారు. తర్వాతేమో.. దయ్యంతో పాత్రలు చాలా మామూలుగా మాట్లాడేస్తుంటాయి. అప్పుడప్పడూ అది దయ్యం అని మనకు గుర్తు చేస్తున్నట్లుగా భయం నటిస్తుంటారు తప్పితే పాత్రల్లో ఏ రకమైన ఫీలింగ్ ఉండదు. సినిమాను కామెడీగా మలచాలనుకోవడంలో తప్పేమీ లేదు. కానీ సీరియస్ గా చెప్పాల్సిన విషయాల్ని ఆ తరహాలోనే చెప్పాలి. కానీ ఈ సినిమాలో ఎక్కడా కూడా ఆ సీరియస్నెస్ కనిపించదు. ప్రతి సన్నివేశాన్నీ చాలా సిల్లీగా డీల్ చేశారు. కథాకథనాలు ఎక్కడా కూడా పద్ధతిగా సాగక.. క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంట్ కూడా సరిగా లేక ప్రేక్షకుల్లో ఆరంభం నుంచే ఒక ‘లైట్’ ఫీలింగ్ వచ్చేస్తుంది. రాయ్ లక్ష్మీకి ప్రథమార్ధంలో అంత బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత దాన్ని తేల్చి పడేశారు. ఆమె సినిమాలో ఉందంటే ఉంది అనేలాగా తయారు చేశారు. ద్వితీయార్ధంలో అయితే రాయ్ లక్ష్మీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్లు తయారైంది. విలన్ పాత్ర కూడా అంతే. మొదట్లో బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత తుస్సుమనిపించారు.

ఓవైపు రాయ్ లక్ష్మీ.. మరోవైపు పూజిత పొన్నాడలను చాలా గ్లామరస్‌ గా చూపించి ఓ వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది. దీంతో పాటుగా డబుల్ మీనింగ్ డైలాగులు.. వల్గర్ కామెడీతో ఆ తరహా వినోదాన్ని ఆశించేవాళ్లను కొంత మెప్పించే ప్రయత్నం చేశారు. అంతకుమించి ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. ద్వితీయార్ధం అంతటా ప్రతి సీన్ సిల్లీగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఈ మాత్రం దానికా ఇంత బిల్డప్ అనే ఫీలింగ్ కలిగిస్తుంది పతాక సన్నివేశం. అసలు ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ అనే టైటిల్ కు.. సినిమాలో చూపించిన విషయానికి సంబంధమే లేదు. బేసిక్ ప్లాట్ ఐడియా మినహాయిస్తే సినిమాలో ఏ ప్రత్యేకతా లేదు. హీరోయిన్ల అందాలు.. అక్కడక్కడా ఊర మాస్ స్టయిల్లో కొన్ని కామెడీ సీన్ల కోసమైతే సినిమా చూడొచ్చు. అంతకుమించి చెకప్పుకోవడానికేమీ లేదు.

నటీనటులు:

రాయ్ లక్ష్మీ తన అందంతో కొంతమేర ఆకట్టుకుంది. కానీ ఆమె లుక్ ఏమంత బాగా లేదు. ముఖంలో గ్లో పోయింది. నటన పరంగా ఆమె నుంచి ఆశించడానికేమీ లేదు. ద్వితీయార్ధంలో ఆమె పాత్ర తేలిపోవడం నిరాశ కలిగిస్తుంది. ప్రవీణ్, మధునందన్ తమ కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. ఐతే వాళ్ల టాలెంటుని పూర్తిగా ఉపయోగించుకోలేదు. రామ్ కార్తీక్ గురించి చెప్పడానికేమీ లేదు. అతడికి జోడీగా నటించిన పూజిత పొన్నాడ మాత్రం ఆకట్టుకుంది. ఆమెలోని గ్లామర్ యాంగిల్ కొత్తగా అనిపిస్తుంది. నటన కూడా బాగుంది. విలన్ గా చేసిన నటుడు ఓవరాక్షన్ చేశాడు. కనిపించిన ప్రతిసారీ ఇరిటేట్ చేశాడు. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతికవర్గం:

హరి గౌర సంగీతం పర్వాలేదు. ప్రథమార్ధంలో ఫోక్ టచ్ ఉన్న రెండు పాటలు పర్వాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం మామూలుగా అనిపిస్తుంది. వెంకట్ శాఖమూరి ఛాయాగ్రహణం మామూలుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లున్నాయి. పల్లెటూరిలో మామూలు లొకేషన్లలో ఏదో అలా సినిమాను లాగించేశారు. తటవర్తి కిరణ్ అందించిన కథ ఓకే కానీ.. అతడి స్క్రీన్ ప్లేలో ఏ విశేషం లేదు. స్క్రిప్టు చాలా వీక్ గా ఉండగా.. దర్శకుడు కిషోర్ కుమార్ దాన్ని తెరపై ప్రెజెంట్ చేయడంలో ఏ ప్రత్యేకతా చూపించలేకపోయాడు. దర్శకుడి అనుభవ లేమి చాలాచోట్ల కనిపించింది. మాస్ మెచ్చే స్లాప్ స్టిక్ కామెడీని డీల్ చేయడంలో అతను కొంచెం పనితనం చూపించాడు. అంతకుమించి దర్శకత్వ పరంగా ఏ ప్రత్యేకతా లేదు.

చివరగా: వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ .. ఎటో పోయింది

రేటింగ్-1.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre