మెగా ఫ్యామిలీ సినిమాలన్నీ వస్తే.. మిగతా హీరోలు ఓటీటీ బాట పట్టాల్సిందే..!

Fri Oct 30 2020 17:00:08 GMT+0530 (IST)

When it comes to mega family movies .. the rest of the heroes have to follow the path of OTT ..!

టాలీవుడ్ లో ఎంతమంది ఫ్యామిలీ హీరోలు ఉన్నా మెగా ఫ్యామిలీ హీరోల హవా ఎక్కువగా ఉంటుంది. స్వయంకృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి సపోర్ట్ తో ఇప్పటి వరకు మొత్తం పదకొండు మంది ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చిరంజీవి - నాగబాబు - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ - అల్లు శిరీష్ - వరుణ్ తేజ్ - సాయి ధరమ్ తేజ్ - వైష్ణవ్ తేజ్ - కళ్యాణ్ దేవ్ - నిహారిక ఇలా అందరూ ఎవరికి వారు కష్టపడి సినిమాలు తీస్తూ అభిమానులను అలరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. దీంతో పాటు మరో మూడు సినిమాలు లైన్లో పెట్టాడు చిరు. మెహర్ రమేష్ తో 'వేదలమ్' రీమేక్.. వివి వినాయక్ తో 'లూసిఫర్' రీమేక్.. బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏకంగా అర డజను సినిమాలకి కమిట్మెంట్ ఇచ్చాడు. ముందుగా వేణు శ్రీరామ్ తో 'వకీల్ సాబ్' సినిమా కంప్లీట్ చేస్తున్నాడు. ఇదే క్రమంలో క్రిష్ తో ఓ పీరియాడికల్ మూవీ.. హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కి పవన్ అంగీకరించాడు. వీటితో పాటు బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ సినిమా.. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ లలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలు పొరపాటున త్వరగా కంప్లీట్ అయితే మాత్రం మిగతా తెలుగు హీరోల సినిమాలకి థియేటర్స్ దొరకడం కష్టమేనని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు.చిరు - పవన్ చిత్రాలు కాకుండా మెగా ఫ్యామిలీలోని మిగతా హీరోల నుంచి సుమారు డజను సినిమాలు రెడీ అవుతున్నాయి. రామ్ చరణ్ 'ఆచార్య' సినిమాలో గెస్ట్ రోల్ చేయడంతో పాటు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే మరో న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయనున్నాడని టాక్. మెగా కాంపౌండ్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తో 'పుష్ప' సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత కొరటాల శివతో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఇక మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇప్పటికే 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని కంప్లీట్ చేశాడు. దేవాకట్టా తో ఓ పొలిటికల్ థ్రిల్లర్.. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ చేయనున్నాడు. వీటితో పాటు గోపాలకృష్ణ అనే కొత్త దర్శకుడితో 'భగవద్గీత' అనే సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలానే వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' చిత్రాన్ని పూర్తి చేసి క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ 'సూపర్ మచ్చి' సినిమాతో పాటు శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఓ మూవీ కమిట్ అయ్యాడని తెలుస్తోంది. వీటితో పాటు అల్లు సిరీస్ కూడా త్వరలోనే ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అనౌన్స్ చేయనున్నాడని అంటున్నారు. మొత్తం మీద రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ నుంచి 22 కు పైగా సినిమాలు రానున్నాయని చెప్పవచ్చు. ఇవన్నీ త్వరగా పూర్తయితే మాత్రం మిగతా హీరోలకి థియేటర్స్ దొరకడం కష్టమే. అంతేకాకుండా డేట్స్ క్లాష్ కారణంగా చాలా చిన్న మీడియం రేంజ్ సినిమాలు డైరెక్ట్ ఓటీటీ బాట పట్టాల్సిందే అని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ చేస్తున్నారు.