ముంబై వెళ్లి ప్రేమలో పడ్డ 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్

Thu Jun 13 2019 07:00:02 GMT+0530 (IST)

'అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రేమలో పడ్డాడట. అదేంటి.. ఆయనకు పెళ్లి కూడా అయిపోయింది కాదా.. మళ్లీ ప్రేమలో పడడం ఏమిటి...? అనుకుంటున్నారా..? అయితే - మీరు పప్పులో కాలేసినట్లే. ఆయన ప్రేమలో పడింది మనుషులతో కాదు.. ముంబై నగరంతో. అవును.. మీరు చదవింది నిజమే. ఈ సంచలన దర్శకుడు ముంబై నగరంతో ప్రేమలో పడిపోయాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఆయన తెరకెక్కించిన ‘కబీర్ సింగ్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని అందరితో పంచుకున్నాడు. ‘కబీర్ సింగ్’ సినిమా కోసం ముంబై వెళ్లిన సందీప్‌కు చిత్ర నిర్మాతలు ముంబై పశ్చిమ శివారులోని ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ ను కేటాయించారు. ఆయన ఈ సినిమాను అక్కడ ఉంటూనే పూర్తి చేశారు. ఈ క్రమంలో ముంబై నగరం సందీప్ కు ఎంతగానో నచ్చేసిందట. అంతేకాదు ‘‘కబీర్ సింగ్ కోసం నేను ఏడాదిగా ముంబైలోనే ఉంటున్నాను. ఈ నగరం నాకెన్నో మర్చిపోలేని మధురానుభూతుల్ని మిగిల్చింది. అందుకే ముంబై నగరంతో నేను ప్రేమలో పడిపోయా. భవిష్యత్ లో కూడా ఇక్కడికి వస్తుంటాను. ముంబై నాకెప్పటికీ గుర్తుంటుంది’’ అంటూ సందీప్ రెడ్డి వంగా తన అనుభవాలను పంచుకున్నారు.

 తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’తో బాలీవుడ్ కు వెళ్లాడు ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం ఆయన షాహీద్ కపూర్ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేశారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ‘కబీర్ సింగ్’ టీజర్ - ట్రైలర్ కు భారీ స్పందన రావడంతో అక్కడ కూడా ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోబోతుందని చిత్ర యూనిట్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇందులో షాహీద్ సరసన కియారా అద్వాణీ నటిస్తోంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.