Begin typing your search above and press return to search.

'వెంకీ మామ'తో నాగార్జున కు సమస్యేంటి?

By:  Tupaki Desk   |   14 Dec 2019 8:20 AM GMT
వెంకీ మామతో నాగార్జున కు సమస్యేంటి?
X
దగ్గుబాటి కుటుంబం తో అక్కినేని ఫ్యామిలీ కి ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రామానాయుడు కూతురు లక్ష్మి నుంచి నాగార్జున విడిపోయినప్పటికీ.. అది రెండు కుటుంబాల సంబంధాల్ని దెబ్బ తీయలేదు. నాగచైతన్య రెండు కుటుంబాలకు మధ్య వారధిగా నిలిచాడు. నాగ్-లక్ష్మిల వివాహ బంధం తెగిన మొదట్లో ఏమైనా గ్యాప్ ఉందేమో కానీ.. ఆ తర్వాత రెండు కుటుంబాలు సన్నిహితంగానే మెలిగాయి. నాగచైతన్య విషయంలో ఇరు కుటుంబాలు ఎంత ప్రేమ చూపిస్తాయో ఎన్నోసార్లు జనాలు చూశారు. పలు వేదికల్లో నాగ్-వెంకీ ఎంతో సన్నిహితంగా మెలగడమూ చూశాం. చైతూ పట్ల దగ్గుబాటి కుటుంబం చూపించే ప్రేమ నాగార్జున కు ఎంతో సంతోషం కలిగిస్తుందని చెబుతుంటారు. హీరోగా మారాక నాగ్ పర్యవేక్షణ లోనే చైతూ సాగుతున్నప్పటికీ.. దగ్గుబాటి వారు కూడా అతడిని కనిపెట్టుకునే ఉంటున్నారు.


తన మనవడు చైతూ, కొడుకు వెంకటేష్ కలిసి ఒక సినిమా చేస్తే చూడాలన్నది రామానాయుడు కల. ఈ కల నెరవేర్చడానికి సురేష్ బాబు ఎన్నో ఏళ్లు ఎదురు చూశారు. చివరికి ‘వెంకీ మామ’తో ఈ కాంబినేషన్‌ను తెరపైకి తెచ్చారు. ఇది ఆ కుటుంబానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమా. కానీ ఈ సినిమా పట్ల అక్కినేని కుటుంబం ఏమంత ఆసక్తిని ప్రదర్శించక పోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. నాగ్ ఈ సినిమా విషయంలో అస్సలు జోక్యం చేసుకోనట్లు కనిపించాడు.

ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు నాగ్ కచ్చితంగా వస్తాడనుకున్నారు. కానీ అలా జరగ లేదు. రిలీజ్ ముందు రోజు మాత్రం మొక్కుబడిగా ఒక ట్వీట్ వేశాడు. అందులో చైతూ పేరు ప్రస్తావించాడు కానీ.. వెంకీ పేరెత్తకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఐతే ఈ సినిమా చూసిన జనాలకు కథ విషయంలో నాగార్జునకు అభ్యంతరాలున్నట్లు చెబుతున్నారు. సినిమాలో తల్లీ తండ్రీ దూరమైన చైతూను వెంకీ అన్నీ తానై అల్లారుముద్దుగా పెంచుతాడు. నిజ జీవితంలో నాగ్, లక్ష్మి అనివార్య కారణాలతో విడిపోయి చైతూకు దూరమైతే వెంకీ అండ్ కోనే చైతూను చూసుకున్నారు. ఈ పాయింట్ గురించి నాగ్‌ కు తెలిసి.. ఫీలై ఉండొచ్చని, అందుకే ఆయన ఈ సినిమాకు దూరంగా ఉండి ఉండొచ్చేమో అని ఇప్పుడు ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటుండం గమనార్హం.