రోబో శంకర్ కి చిట్టిబాబుపై డౌట్ దేనికి?

Sun Apr 18 2021 23:00:01 GMT+0530 (IST)

What is the doubt about Chittibabu to Robo Shankar?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - రోబో శంకర్ కలయికలో భారీ పాన్ ఇండియా చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎలాంటి పాత్రలో నటిస్తారు? అన్నదానికి ఇంతకుముందే కొన్ని లీకులు అందాయి.  ఈ చిత్రంలో చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారని సంఘంలో కొందరు నాయకుల వల్ల ఎదురైన సవాళ్లతో అతడు ముఖ్యమంత్రిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తారని కూడా కథ గురించి లీక్ అందింది.అంతేకాదు.. ఈ చిత్రంలో చరణ్ మరో విలక్షణ మైన పాత్రలో కనిపించే వీలుందని గుసగుస వేడెక్కిస్తోంది. చరణ్ కాస్త ఏజ్డ్ పర్సన్ లా కనిపించాల్సి ఉంటుందట. అయితే అంత సీనియర్ సిటిజన్ పాత్రకు అతడు సూటవుతాడా?  అన్న సందేహం కొందరు వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి రజనీకాంత్ .. కమల్ హాసన్- విక్రమ్ లాంటి స్టార్లను శంకర్ ఎంతో విలక్షణంగా చూపించారు. ఒకే సినిమాలో వైవిధ్యం ఉన్న పాత్రల్లో కనిపించారు వీళ్లంతా. అపరిచితుడులో విక్రమ్ రామ్ - రెమో పాత్రల్లో కనిపిస్తే రజనీ రోబో చిత్రంలో సైంటిస్టుగా చిట్టీగా అదరగొట్టారు. కమల్ హాసన్ భారతీయుడు చిత్రంలో యువ ప్రేమికుడిగా సేనాపతిగా విలక్షణ పాత్రలతో సంచలనాలు సృష్టించారు. అదే తీరుగా చరణ్ ని కూడా విభిన్న పాత్రలతో దుమారం రేపేందుకు ఆస్కారం లేకపోలేదని అంచనా వేస్తున్నారు.

తన ఫేవరెట్  శంకర్ తో పని చేయాలన్న కలను నిజం చేసుకునేందుకు చరణ్ చాలా కాలంగా వేచి చూస్తున్నారు. ఇక శంకర్ సినిమాలో ఏజ్డ్ పాత్రకు చిరంజీవి లేదా పవన్ అయితే బావుంటుందని భావిస్తున్నట్టు కథనాలు వచ్చినా అదే పాత్రలో చరణ్ నే నటింపజేస్తే బావుంటుందని శంకర్ కథనాన్ని మార్చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఆ పాత్రలో చరణ్ మెప్పిస్తాడా? అంటే దాని విషయంలో డౌట్లు అక్కర్లేదు. అతడు ఇంతకుముందే ధృవలో వైవిధ్యమైన పాత్రతో మెప్పించాడు. దానికి సంబంధం లేని విధంగా రంగస్థలంలో చెవిటి వాడైన చిట్టిబాబుగానూ అదరగొట్టాడు. వైవిధ్యం కోరుకునే హీరో అని ప్రూవ్ చేశాడు. అందుకే ఇప్పుడు శంకర్ తో సంచలనాలు ఖాయమని మెగాభిమానులు నమ్ముతున్నారు. మెగాస్టార్ కెరీర్ లో ఎన్ని ప్రయోగాలు చేశారో అన్ని ప్రయోగాలు చేసేందుకు చరణ్ కూడా ఇప్పుడు సిద్ధమవుతున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.