ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు?

Wed Jun 29 2022 21:00:01 GMT+0530 (IST)

What are these expectations for Prabhas fans for another year?

ప్రభాస్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ ఏంటో ఫాలోయింగ్ ఎలాంటిదో వివరించక్కర్లేదు. ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం ‘ఈశ్వర్’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి అనతికాలంలోనే టాప్ హీరోల్లో ఒకరిగా ఎదిగిన ప్రభాస్.. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి'తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ప్రస్తుతం ఈయన చేతిలో అఫీషియల్ గా నాలుగు పెద్ద ప్రాజెక్ట్ లు ఉన్నాయి.వాటిలో ఒకటి 'ఆదిపురుష్'.  రామాయణం ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇందులో రాముడిగా ప్రభాస్ సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించారు. అలాగే సైఫ్ అలీ ఖాన్ సన్నీ సింగ్ హేమా మాలిని తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ విడుదల కానుంది.

టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ క్రిషన్ కుమార్ ఓంరౌత్ ప్రసాద్ సుతార్ రాజేశ్ నాయర్ సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు గ్రాఫిక్స్ పనులు దాదాపు తుది దశకు చేరుకుంటున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే డబ్బింగ్ పనులను సైతం షురూ చేయనున్నారు.

కానీ ఇప్పటి వరకు ఈ మూవీ నుండి ప్రభాస్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసే అప్డేట్ ఒక్కటంటే ఒక్కటి రాలేదు. కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా బయటకు వదలకపోవడంతో అభిమానులు మేకర్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ వారి ఆగ్రహాన్ని చిత్ర టీమ్ పట్టించుకోవడం లేదు. ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడమూ లేదు.

ఇక ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో 'సలార్' మరొకటి. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ డ్రామా ఇది. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టీజర్ ను మే నెల ఆఖరిలో విడుదల చేస్తామని గతంలో చిత్రయూనిట్ స్వయంగా ప్రకటించింది.

అయితే మే తర్వాత జూన్ నెల సైతం అయిపోతోంది. కానీ సలార్ టీజర్ మాత్రం బయటకు రాలేదు. దీంతో ప్రభాస్ సినిమాల అప్డేట్స్ కోసం ఎదురుచూపులు ఇంకెన్నాళ్లో అర్థంగాక అభిమానులు నిరాశలో మునిగిపోయారు. మరి ఇప్పటికేనా 'ఆదిపురుష్' 'సలార్' చిత్రాల మేకర్స్ కాస్త మేల్కొని అప్డేట్స్ ఇస్తారా..లేదా.. అన్నది చూడాలి.