హ్యాట్రిక్ ప్లాప్స్ తర్వాత యంగ్ బ్యూటీ పరిస్థితేంటి..?

Fri Sep 30 2022 09:29:31 GMT+0530 (India Standard Time)

What about the young beauty after hat-trick flops?

'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కుర్ర భామ కృతి శెట్టి.. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిన కృతికి.. వరుస ఆఫర్లు వచ్చాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన యంగ్ బ్యూటీ.. వచ్చిన ప్రతీ చిత్రానికి సైన్ చేసుకుంటూ వచ్చింది.2021 ఫిబ్రవరి నుండి 2022 సెప్టెంబర్ వరకు కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే అందులో హిట్లు ఎన్ని ఉన్నాయో ప్లాప్స్ కూడా అన్నే ఉన్నాయి. హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ ఫార్మ్ లో ఉందనిపించుకున్న కృతి.. హ్యాట్రిక్ ప్లాప్స్ తో రేసులో మళ్లీ వెనకబడిపోయింది.

'ఉప్పెన' తర్వాత కృతి నటించిన 'శ్యామ్ సింగరాయ్' మరియు 'బంగార్రాజు' సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. దీంతో తక్కువ టైంలోనే టాప్ పొజిషన్ కు ఎదిగిందని భావిస్తుండగా.. 'ది వారియర్' 'మాచర్ల నియోజకవర్గం' వంటి బ్యాక్ టూ బ్యాక్ రెండు పరాజయాలు చవిచూసింది.

ఇటీవల వచ్చిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రం కూడా ఇదే జాబితాలో చేరిపోయింది. ఇందులో తొలిసారిగా కృతి శెట్టి ద్విపాత్రాభినయం చేసింది. నటనకు స్కోప్ ఉన్న పాత్రలే అయినప్పటికీ.. కథ కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ప్లాప్ గా మిగిలింది.

అయితే హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్న తర్వాత కృతి తన కెరీర్ కు గాడిలో పెట్టుకోడానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. తన పాత్రకు ప్రాధాన్యత ఉండటమే కాదు.. మిగతా పాత్రలు మరియు కథని దృష్టిలో పెట్టుకొని సినిమాలు సైన్ చేయాలని ఫిక్స్ అయింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు 'అచలుడు' సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ హీరో సూర్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలానే యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య తో కలిసి NC22 అనే తెలుగు తమిళ ద్విభాషా చిత్రంలో నటిస్తోంది. 'బంగార్రాజు' తర్వాత మరోసారి వీరిద్దరూ జోడీ కట్టారు.

ఈ రెండు సినిమాలతో ఖచ్చితంగా సక్సెస్ అందుకొని మళ్లీ ఫార్మ్ లోకి వస్తానని కృతి శెట్టి భావిస్తోంది. తెలుగుతో పాటుగా ఒకేసారి తమిళ్ లోనూ సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.