పూరి విజయ్ రమ్యకృష్ణ మైక్ టైసన్..ఒక డ్రీం కాంబినేషన్

Fri Aug 12 2022 18:34:16 GMT+0530 (India Standard Time)

'Liger' Villain 'Vish' Interacted With The Media On this Occasion

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన బాక్సింగ్ డ్రామా `లైగర్`. వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక అతిథి పాత్రలో నటించగా శివగామి రయ్యకృష్ణ తల్లి పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే తెలుగు తెరకు పరిచయం అవుతోంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ తో కలిసి పూరి కనెక్ట్స్ పై చార్మి పూరి జగన్నాథ్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ పాటలు విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్నిపెంచేశాయి.దీనికి తోడు దేశ వ్యాప్తంగా హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్ డమ్ టూర్ పేరుతో చేస్తున్న ప్రచారం సినిమాని మరింత ట్రెండ్ అయ్యేలా చేస్తోంది. ఆగస్టు 25 న ఈ మూవీని ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇందులో విలన్ గా నటించిన విష్ ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.
 
దర్శకుడు పూరీ జగన్నాథ్ తో మీ ప్రయాణం గురించి ?

పూరి గారిని కలవక ముందే ఆయన సినిమాలకు అడిక్ట్ అయ్యాను. కాలేజ్ ఎగ్గొట్టి ఆయన సినిమాలు చూస్తుండేవాడిని. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ ని. నా మార్షల్ ఆర్ట్స్ వీడియోస్ చూసి నన్ను పిలిపించారు. 2015లో ఆయన్ని కలిసా. మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలో సినిమా చేస్తానని అప్పుడే `లైగర్` ఐడియా చెప్పి టచ్ లో వుందామని చెప్పారు. ఆయన మెహబూబా ఇస్మార్ట్ శంకర్ రొమాంటిక్ చిత్రాలు చేశాను. ఎట్టకేలకు లైగర్ తో నా కల తీరింది. పూరి గారు విజయ్ దేవరకొండ రమ్యకృష్ణ మైక్ టైసన్ .. ఒక డ్రీం కాంబినేషన్. చాలా అదృష్టంగా భావిస్తున్నా.

పూరి కనెక్ట్స్ సిఈవో ఎలా అయ్యారు ?

పూరి గారి దగ్గరికి రాకముందు కొన్ని సినిమాలు చేశాను. జోష్ తన తొలి చిత్రం. అందులో ఒక చిన్న నెగిటివ్ పాత్ర చేశా. తర్వాత ప్రొడక్షన్ సహాయ దర్శకుడిగా కూడా పని చేసి ఇండస్ట్రీని అర్ధం చేసుకున్నాను. మెహబూబా ప్రొడక్షన్ నేనే చేశా. పూరి గారు నాపై నమ్మకం వుంచి  సిఈవో గా చేశారు.

మొదటి పాన్ ఇండియా మూవీ చేయడం ఎలా అనిపించింది ?

చాలా కాలంగా మార్షల్ ఆర్ట్స్ లో వున్నా. నిరంతర శ్రమ వుంటుంది. అలాగే నటనపై కూడా చాలా హోం వర్క్ చేశా. ఇప్పుడు లైగర్ లాంటి పాన్ ఇండియా మూవీలో చేయడం గొప్ప సంతోషాన్ని ఇచ్చింది.

విజయ్ మైక్ టైషన్ లాంటి బలమైన పాత్రల మధ్య మీ రోల్ ఎలా ఉండబోతుంది ?.

లైగర్ చాలా అహంకారి గల ఫైటర్ రోల్ చేస్తున్నా.  విజయ్ నా పాత్రల మధ్య శత్రుత్వం ఏమిటనేది సినిమా చూస్తే అర్ధమౌతుంది. లైగర్ లో ఒక లెజెండ్ ఫైటర్ పాత్ర అవసరం ఏర్పడింది. లెజెండ్ అంటే మనకి మైక్ టైషన్ గుర్తుకువస్తారు. ఆయన కంటే బెస్ట్ ఆప్షన్ కనిపించలేదు. ఆయనకి కథ అద్భుతంగా నచ్చి ప్రాజెక్ట్ లోకి రావడం ఆనందంగా అనిపించింది.

మైక్ టైషన్ నుండి ఏం నేర్చుకున్నారు ?

చిన్నప్పటినుండి మైక్ టైసన్ కి ఫ్యాన్ బాయ్ నేను. ఆయన ఫైట్స్ చూస్తూ పెరిగాను. అయితే పర్శనల్ గా ఆయన ఎలా వుంటారో అనే ఒక ఆసక్తి వుండేది. కానీ ఆయన్ని పర్శనల్ గా చూసిన తర్వాత నా ఊహ తలకిందులైయింది. పదేళ్ళ చిన్న పిల్లాడు ఎలా ఉంటారో ఆయన అంత స్వీట్ గా వున్నారు. నేను కలసి గొప్ప వ్యక్తులు జీవితం గురించి క్లాసులు పీకలేదు. ఆయన కూడా 'నీకు సంతోషాన్ని ఇచ్చేదే చెయ్' చెప్పారు.

మైక్ టైసన్ ని తీసుకోవాలనే ఆలోచన ఎవరిది ?

పూరి గారిదే. అయన రెబల్. ఆయనకి సరహద్దులు వుండవు. పరిమితులు ఎప్పుడూ పెట్టుకోరు.  నేను కూడా ఆయన లానే లిమిట్స్ పెట్టుకోను. అయితే మైక్ ని ప్రాజెక్ట్ లోకి తీసుకురావడానికి చార్మీగారు ఎక్కువ కష్టపడ్డారు. ఈ క్రెడిట్ ఆమెకే దక్కుతుంది.

మైక్ టైసన్ పాత్ర ఎలా ఉండబోతుంది ?

ఆయన లెజండ్ పాత్రలో కనిపిస్తారు. ఫైట్లు వుంటాయి. ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో తెరపై చూడాల్సిందే.

మిగతా స్పోర్ట్స్ డ్రామాలకు లైగర్ కు వున్న ప్రత్యేకత ఏమిటి ?

లైగర్ స్పోర్ట్స్ డ్రామా కాదు. లైగర్ పక్కా మాస్ మసాలా యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్. ఎంఎంఏ అనేది ఒక నేపధ్యంలో వుంటుంది. అంతేకానీ ఇది స్పోర్ట్స్ బయోపిక్ కాదు. చిన్నపిల్లల దగ్గర నుండి యూత్ ఫ్యామిలీస్ అందరూ చూసి ఎంజాయ్ చేసేలా వుంటుంది.